రోడ్లపై ఆహారం వేస్తూ ప్రాణాలతో చెలగాటం..

by Kodari Anjali |

అడవి శాఖ అధికారులు, పోలీసులు మొర్రో అని మొత్తుకుంటున్న ప్రయాణికుల తీరు ఏమాత్రం మారడం లేదు.

రోడ్లపై ఆహారం వేస్తూ ప్రాణాలతో చెలగాటం..
X

దిశ, నర్సాపూర్: అడవి శాఖ అధికారులు, పోలీసులు మొర్రో అని మొత్తుకుంటున్న ప్రయాణికుల తీరు ఏమాత్రం మారడం లేదు. రోడ్డుపైన కోతులకు విచ్చలవిడిగా ఆహారం వేస్తూ తోటి ప్రయాణికుల ప్రాణాలతో, కోతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి ఆనుకొని దట్టమైన అడవి ప్రాంతం కలదు. ఈ అడవిలో వందల సంఖ్యలో కోతులు జీవిస్తున్నాయి. దారి పొడుగునా వెళ్లే ప్రయాణికులు రోడ్లపైన ఆహారం వేయడంతో కోతులు రోడ్లపైనే తిష్ట వేసుకొని కూర్చుంటున్నాయి. ఇలా రోడ్ల పైన కోతులకు ఆహారం వేయడంతో ద్విచక్ర వాహనదారులు, కోతులకు ప్రాణ సంకటంగా మారుతుంది. రోడ్ల పైన ఆహారం వేయడంతో కోతులు గుంపులు గుంపులుగా చేరి ఆహారాన్ని తీసుకొని రోడ్డు దాటే క్రమంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలను కోల్పోతున్నారు.

ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో...

అటవీశాఖ అధికారులు, పోలీసులు రోడ్లపైన ఆహారం వేయకూడదని ఎంత మొత్తుకున్నా ప్రయాణికుల్లో మాత్రం చలనం రావడం లేదు. పైగా రోడ్డు పక్కన, రోడ్డుపైన ఆహారం వేస్తూ రీల్స్ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ పాక్షికానందం పొందుతున్నారు. కోతులకు ఆహారం వేయడం తప్పు కాదు కానీ ఇలా రోడ్ల పైన వేస్తేనే అమాయక జనాలు ప్రాణాలు వదులుతున్నారు. ఇందుకుగాను అటవీ శాఖ అధికారులు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అడవి ప్రాంతంలో కోతుల ఆహార సేకరణ కేంద్రంను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ప్రయాణికులలో ఏ మాత్రం మార్పు రాక రోడ్లపైనే ఇష్టానురీతిగా ఆహారాన్ని, పండ్లను పారవేస్తున్నారు. అధికారుల, పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రయాణికులు ఈ నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారని, ఇప్పటికైనా పెట్రోలింగ్, నిఘా ఏర్పాటుచేసి ఇలాంటి చేష్టలు చేసేవారి భరతం పట్టాలని తోటి ప్రయాణికులు కోరుతున్నారు.

ఆహార సేకరణ కేంద్రంలో ఇవ్వండి... ఎఫ్ ఆర్ ఓ దివ్య

కోతులకు ఆహారం వేయాలనుకుంటే అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కోతుల ఆహార సేకరణ కేంద్రంలో అందజేయాలి. ఆహారాన్ని సిబ్బంది అడవి లోపటికి తీసుకెళ్లి వాటికి అందించడం జరుగుతుంది. అంతేగాని రోడ్ల పైన ఎలాంటి ఆహారాన్ని కోతులకు వేయరాదు.

ప్రాణాలతో చెలగాటమాడకండి... ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి

రోడ్ల పైన కోతులకు ఆహారం వేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. దీనిపైనా ఇప్పటికే అవగాహన కల్పించాము, ముందు ముందు కల్పిస్తాము. మానవతా దృక్పథంతో ఆలోచించి రోడ్లపై కాకుండా ఆహారాన్ని స్టాల్ లో అందజేయండి.

Next Story