రియల్ హీరోస్... స్నేక్ సేవర్స్ అనిల్ ఫ్యామిలీ

by Naveena |

పాములు కనిపిస్తే చాలు, భయంతో పరుగులు పెట్టే మనుషుల మధ్య, వాటిని ప్రేమగా పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టే ఒక కుటుంబం.

రియల్ హీరోస్... స్నేక్ సేవర్స్ అనిల్ ఫ్యామిలీ
X

దిశ ,కంగ్టి : పాములు కనిపిస్తే చాలు, భయంతో పరుగులు పెట్టే మనుషుల మధ్య, వాటిని ప్రేమగా పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టే ఒక కుటుంబం. వీరు కేవలం పాములను మాత్రమే కాపాడడం కాదు,..మనుషుల ప్రాణాలకు కూడా రక్షణగా నిలుస్తున్నారు. కంగ్టి కేంద్రంలోని శ్రీ సాయి దివ్య జువెలర్స్ షాప్‌లో గోల్డ్ స్మిత్‌గా పనిచేస్తున్న అనిల్, స్నేక్ క్యాచర్‌గా విస్తృతంగా సేవలందిస్తున్నారు. ఎక్కడైనా పాము కనిపించినట్లు సమాచారం అందితే, క్షణాల్లో అక్కడికి చేరుకుని, వాటిని ఎలాంటి హాని లేకుండా పట్టుకుని అటవీ ప్రాంతాల్లో విడిచిపెడతారు. ఏటా వందల సంఖ్యలో పాములను కాపాడుతూ..రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

అనిల్ స్వస్థలం కర్ణాటకలోని ఔరాద్ నాగన్ పల్లి. పని నిమిత్తం కంగ్టికి వలస వచ్చి, కుటుంబంతో స్థిరపడ్డారు. మహారాష్ట్రలోని ఉదగిర్ సిటీ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన అనిల్, ఎన్సీసీ క్యాడెట్‌గా స్నేక్ క్యాచింగ్ మెలకువలు నేర్చుకున్నారు. ఇప్పుడు అతని భార్య రాధ, పిల్లలు ఆయుష్ (10), శివన్స్ (6), అక్షయ (5) కూడా ఈ సేవా కార్యక్రమంలో ఆసక్తి కనబరుస్తున్నారు.

పాము ఉందంటే.. పనిని పక్కనపెట్టి పరుగెత్తే అనిల్!

స్నేక్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తూ, తన స్వంత ఖర్చుతోనే ఈ సేవను కొనసాగిస్తున్న అనిల్ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇంట్లో పాము కనిపిస్తే, "ఎంత దూరమైనా నేను వస్తా, పాములను చంపొద్దు" అని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

అనిల్ సేవకు మద్దతుగా యజమాని!

సాధారణంగా, ఉద్యోగి పని మానేసి బయటకు వెళ్తే యజమాని అసహనం చెందడం సహజం. కానీ అనిల్‌ చేస్తున్న విశిష్ట సేవను అర్థం చేసుకున్న జ్యూవెలరి షాప్ యజమాని, అతనికి పూర్తి మద్దతునిస్తున్నాడు. "అతను గొప్ప పని చేస్తున్నాడు. పాములను కాపాడడం, వాటిని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టడం నిజంగా అభినందించదగ్గ పని. నేను ఎప్పుడూ అడ్డుగా ఉండను," అని షాప్ యజమాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తండ్రి బాటలోనే పిల్లలు

అనిల్‌ సేవా కార్యక్రమాన్ని చూసి, ఆయన పిల్లలు కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు. పిల్లలు ఆయుష్, శివన్స్,అక్షయ చిన్నప్పటి నుంచే పాములపై భయం లేకుండా, వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటూ పెరుగుతున్నారు. తండ్రితో పాటు పాములను పట్టుకోవడం, వాటిని ఎలాంటి హాని కలగకుండా విడిచిపెట్టడం వీరి జీవితంలో ఒక భాగంగా మారింది. పాములను చూసి భయపడే సమాజానికి, అవి కూడా ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తాయని తెలియజేస్తూ, నిజమైన రియల్ హీరోగా నిలుస్తున్న అనిల్ కుటుంబానికి సమాజం నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది.

Next Story