రేపే పల్స్ పోలియో

by Taduka Kalyani |

పోలియో రహిత సమాజమే లక్ష్యంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు.

రేపే పల్స్ పోలియో
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పోలియో రహిత సమాజమే లక్ష్యంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 94,321 మంది 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నట్లు అంచనా. అర్హులైన ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేసేలా జిల్లాలో 568 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా 57 మంది సూపర్ వైజర్ల పర్యవేక్షణలో 32 ట్రాన్స్ పోర్టు పాయింట్లు (బస్టాండ్, రైల్వే స్టేషన్లు) లలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణ రంగాల ప్రాంతంలో, సిమెంట్ ఫ్యాక్టరీలు, క్వారీలు, భిక్షాటన కొరకు వలస వచ్చిన వారి అర్హులైన పిల్లలను గుర్తించి చుక్కలు వేసేందుకు మొబైల్ టీంలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్యం కేంద్రాలు, బస్తీ దవాఖాన్ లో, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో పోలియో చుక్కల పంపిణీ కేంద్రాలను సిద్ధం చేశారు. ఆదివారం పోలియో చుక్కల కేంద్రంలో పోలియో చుక్కలు వేయించని పిల్లలకు, 29వ తేది సోమవారం, 30వ తేదీ మంగళవారం రోజులలో ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు అంగన్ వాడి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు తీసుకొని పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది, విద్యాశాఖ సిబ్బంది సమన్వయం తో పని చేసే విధంగా జిల్లా ఉన్నతాధికారులు తగిన సూచనలు చేశారు.

ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి : డీ ఎం హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్

తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డీ ఎం హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్ సూచించారు. గతంలో పోలియో చుక్కలు వేసినా మరోసారి వేయించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి మరింత పెరుగుతుందన్నారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

Next Story