నర్సారెడ్డికి నిరసన సెగ.. కారును అడ్డగించిన మహిళలు

by Bhoopathi Nagaiah |

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డికి నిరసన సెగ తగిలింది.

నర్సారెడ్డికి నిరసన సెగ.. కారును అడ్డగించిన మహిళలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డికి నిరసన సెగ తగిలింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే డీసీసీ ప్రెసిడెంట్ తుంకుంట నర్సారెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసు కమిషనర్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకాగా ఆ కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో నర్సారెడ్డి వాహనాన్ని దళిత సంఘాల మహిళలు, నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దళిత ద్రోహి నర్సారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ హఠాత్తు పరిణామంతో నర్సారెడ్డి కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఇటీవల గజ్వేల్ పట్టణంలో రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరైన సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్‌కు డీసీసీ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తదనంతరం నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Next Story