సిద్దిపేట టు కాచిగూడ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-02 15:09:10  IST  )

ఎన్నికల నినాదాలకే పరిమితమైన సిద్దిపేట రైలు కల నేడు సాకారం కానుంది.

సిద్దిపేట టు కాచిగూడ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఎన్నికల నినాదాలకే పరిమితమైన సిద్దిపేట రైలు కల నేడు సాకారం కానుంది. కొత్త పల్లి - మనోహరాబాద్ రైల్వే మార్గంలో భాగంగా సిద్దిపేట నుండి కాచిగూడ వరకు పుష్ -పుల్ డిజిల్ రైలును మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ముఖ్య మైన రైల్వే రవాణా మార్గమైన కొత్తపల్లి -మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదించగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రూ.1160 కోట్ల అంచనా వ్యయంతో 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పనులకు శంకుస్థాపన చేశారు.

సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవ ఫలితంగా సిద్దిపేట నుండి మనోహరాబాద్ వరకు పనులు త్వరగా పూర్తి అయ్యాయి. సిద్దిపేట నుండి ప్రారంభమయ్యే రైలు దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్, బేగంపేట, నాచారం, మనోహరాబాద్, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, బొల్లారం, మల్కాజ్ గిరి, స్టేషన్ల మీదుగా కాచిగూడ వరకు వెళ్లనున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలుత పుష్ -పుల్ డిజిల్ రైలు సిద్దిపేట నుండి కాచిగూడకు, కాచిగూడ నుండి సిద్దిపేటకు రెండు పర్యాయాలు ప్రయాణీకులను తీసుకెళ్లనుంది. సిద్దిపేట నుండి సికింద్రాబాద్ కు ఒక్కొక్క ప్రయాణీకుడికి రూ.60 చార్జీ అవుతుంది. దశాబ్దాలుగా ఎన్నికల నినాదాలకే పరిమితమైన సిద్దిపేట రైలు కల నెరవేరనుండటంతో సిద్దిపేట ప్రజలకు మంత్రి తన్నీరు. హరీష్ రావు అభినందనలు తెలిపారు.

Next Story