మెదక్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలు

by Taduka Kalyani |

మెదక్ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు టూరిజం కన్సల్టెంట్ శవంతి గుప్తా, భువన్ తెలిపారు.

మెదక్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలు
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు టూరిజం కన్సల్టెంట్ శవంతి గుప్తా, భువన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మెదక్ జిల్లా ఆదేశానుసారం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి చేయడంలో భాగంగా గురువారం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ప్రముఖ టూరిజం, పర్యాటక విభాగం కన్సల్టెంట్ శవంతి గుప్తా, భువన్ సందర్శించారు. మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేయడం, జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు జిల్లాలోని నర్సాపూర్ అర్బన్ పార్క్, పార్క్ కాటేజీలు, వెంకట్రావుపేట కోట, మెదక్ ఖిల్లా ప్రాంతాలను సందర్శించడం జరిగింది. జిల్లాలోగల అనేక చారిత్రక ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా (టూరిస్ట్ హబ్‌లుగా) తీర్చిదిద్దేందుకు టూరిజం కన్సల్టెంట్ అధికారులు శవంతి గుప్తా, భవన్ లు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులు, చారిత్రక విశిష్టత, పర్యాటకులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులతో పాటు మరింత అభివృద్ధి చేయాల్సిన అంశాలను వారు పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రదేశాల సుందరీకరణ, వాకింగ్ ట్రాక్‌లు, వీక్షణ స్థలాలు, పార్కింగ్ సదుపాయాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, దిశా సూచిక బోర్డులు, విద్యుత్ వెలుగులు, పిల్లల వినోద సదుపాయాలు, భద్రతా చర్యలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

నర్సాపూర్ అర్బన్ పార్క్ మరియు పార్క్ కాటేజీలను కుటుంబ పర్యాటకానికి, వివాహ, వినోద కార్యక్రమాలకు అనువుగా అభివృద్ధి చేయడంతో పాటు, వెంకట్రావుపేట కోట, మెదక్ ఖిల్లా చారిత్రక ప్రాధాన్యతను దేశ విదేశాల పర్యాటకులకు చేరువ చేసే విధంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా టూరిజం శాఖ వారికి సూచించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, స్థానిక కళలు, సంస్కృతి, హస్తకళలు, చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, మెదక్ జిల్లాను తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రమేష్ గంగాల, ఇ.డి.యం. సందీప్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్. అధికారులు, పర్యాటక శాఖ ప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Next Story