- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూపు కోల్పోయిన పటాన్ ‘చెరువు’లు.. పదేళ్లలో అంతులేని కబ్జాలు
చెరువు, కుంటలను చెరబెట్టిన అక్రమార్కుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తున్నది.

దిశ, సంగారెడ్డి బ్యూరో/పటాన్ చెరు: చెరువు, కుంటలను చెరబెట్టిన అక్రమార్కుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తున్నది. ప్రధానంగా గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటల కబ్జాలకు కేంద్రంగా మారిన పటాన్ చెరు సెగ్మెంట్ లో అక్రమార్కులు, లీడర్లు వణికిపోతున్నారు. అక్రమార్కుల వద్ద కోట్లు దిగమింగి, చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన లీడర్లు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్ పూర్ లో కబ్జాలకు గురైన చెరువులను పరిశీలించిన విషయం తెలిసిందే. చెరువుల అలుగులు, తూముల మూసివేతపై రంగనాథ్ అధికారులపై కన్నెర్ర చేశారు. ఒక్క అమీన్ పూర్ పరిధిలోనే 13 చెరువుల్లో దాదాపు 882 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎవరినీ వదిలిపెట్టమని, అక్రమ నిర్మాణాలను కూల్చేవేస్తామని రంగనాథ్ సీరియస్ హెచ్చరికలు జారీచేసి వెళ్లారు. కాగా హైడ్రా ఎప్పుడూ పటాన్ చెరు, అమీన్ పూర్ చెరువుల్లోని నిర్మాణాలపై పడుతుందోనని లీడర్లకు టెన్షన్ పట్టుకున్నది. నిర్మాణాలు కూల్చివేస్తే అప్పుడు అక్రమార్కుల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాల్సి వస్తుందని, బాధితులు తమ వద్దకు వచ్చి ఆందోళన చేసే ప్రమాదం ఉన్నదని, లీడర్లు ఆగమాగమైపోతున్నట్లు లీడర్ల సన్నిహితులు చెబుతున్నారు. పటాన్ చెరులో హైడ్రా కన్నెర్రతో జరిగే పరిణామాలపై రాజకీయంగా ఆసక్తి నెలకొన్నది....
* అంతా నేతల అండదండలతోనే...
పటాన్ చెరు సెగ్మెంట్ పరిధిలోని అమీన్ పూర్, పటాన్ చెరు, జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రాపూరం మండలాల పరిధిలోని గత పదేళ్ల కాలంలో చెరువు, కుంటలు కబ్జాలు గురయ్యాయి. చెరువు, కుంటల్లో రోజు వ్యవధిలో భవనాల నిర్మాణాలు జరిగాయి. ఈ కబ్జాలపై మీడియా కథనాలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. అక్రమార్కులు మాత్రం ఏం భయపడలేదు. అక్రమార్కుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్న లీడర్లు అధికారులకు చెప్పి అక్రమ నిర్మాణాల వైపు వెళ్లకుండా చూశారు. దీనితో తెల్లాపూర్, అమీన్ పూర్, జిన్నారం ప్రాంతాల్లో యథేచ్ఛగా చెరువు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. అమీన్ పూర్ పెద్ద చెరువులో అర్థరాత్రిళ్లు లారీలు, టిప్పర్లతో మట్టిపూసి రోడ్లు వేసినా అధికారులు పట్టించుకోలేకపోయారు. రోజుల వ్యవధిలోనే చెరువుల్లో నిర్మాణాలు వెలిసిపోయాయి. ఎవరికి వారు బడా నాయకుడు మొదలు స్థానిక చోట లీడర్ల వరకు అక్రమార్కుల నుంచి అందిన కాడికి తీసుకుని నిర్మాణాలకు అండగా నిలిచారు. ఎప్పుడో ఓ సారి మేమున్నాం అన్నట్లుగా అధికారులు అక్కడక్కడ చిన్నపాటి నిర్మాణాలు కూల్చినట్లు చేసి చేతులు దులుపుకున్నారు.
* రంగంలోకి హైడ్రా..నేతల్లో హైరానా..
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెరువు, కుంటల ఆక్రమణ, కబ్జాలపై ప్రత్యేక నజర్ పెట్టింది. నీటి వనరులను కాపాడుకోవాలని భావించిన సర్కారు ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసిన విదితమే. కాగా హైడ్రా పటాన్ చెరుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్ పూర్ లో చెరువు, కుంటలను పరిశీలించారు. పెద్ద చెరువు, కొత్త చెరువు, బంధం చెరువులను పరిశీలించి ఆక్రమణలు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు అలుగులు, తూములు ఎలా మూసివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే అధికార వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అని అసహనం వ్యక్తం చేశారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీటి వనరులను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఎంతటి వారైన ఉపేక్షించబోమన్నారు. కాగా ఒక్క అమీన్ పూర్ పరిధిలోనే 13 చెరువుల్లో 882 వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి నివేదికలు రూపొందించారు.
* ఇప్పుడెలా..? నేతల అయోమయం..
తమ అండదండలతోనే అక్రమార్కులు చెలరేగిపోయి చెరువును చెరబెట్టారని లీడర్లకు అంతా తెలుసు. అయితే ఇప్పుడు హైడ్రా ఆ నిర్మాణాలను కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటని అందోళన చెందుతున్నారు. బిల్డర్లు, అక్రమ నిర్మాణ దారుల నుంచి పెద్ద ఎత్తున అందిన కాడికి కోట్లు తిన్న నేతలు ఆ నిర్మాణాల కూల్చివేతతో పరేషాన్ చెందక తప్పని పరిస్థితి. అంతే కాకుండా తమ నిర్మాణాలు కూల్చితే బాధితులు నేరుగా డబ్బు తీసుకున్న లీడర్ల వద్దకు వచ్చి అందోళన చేసే అవకాశం ఉన్నది. దీనితో ఇప్పుడేం చేద్దామని తీవ్ర హైరానా చెందుతున్నారు. గ్రామ స్థాయి మొదలుకుని, మండల, మున్సిపల్ పరిదిలోని కింది స్థాయి కొందరు ప్రజా ప్రతినిధులు, నాయకులు అక్రమార్కుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారు. అయితే నిర్మాణాలు కూల్చివేస్తే అన్ని రకాలుగా నిండా మునిగే బాధితులు లీడర్లతో ఘర్షణకు దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైడ్రా ఎప్పుడు ఏ ఇంటిపై బుల్డోజర్ పెట్టనున్నదోనని లీడర్లు, అక్రమార్కుల్లో అందోళన కనొపిస్తుంటే, హైడ్రా కూల్చివేతలతో జరిగే పరిణామాలు ఎలా ఉండనున్నాయనేది అందరిలో ఆసక్తి నెలకొన్నది.






