ఓటరు జాబితా సవరణ పై ప్రతిపక్షాల దుష్ప్రచారం మానుకోవాలి

by Taduka Kalyani |

ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు తీవ్రంగా విమర్శించారు.

ఓటరు జాబితా సవరణ పై ప్రతిపక్షాల దుష్ప్రచారం మానుకోవాలి
X

దిశ, కొండపాక: ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు తీవ్రంగా విమర్శించారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం మాత్ పల్లి గ్రామంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిక్షణ శిబిరంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1952 నుంచి దేశవ్యాప్తంగా దాదాపు పది సార్లు ఇలాంటి ఓటరు జాబితా సవరణలు జరిగాయని, ఇది కొత్తగా తెచ్చిన అంశం కాదని ఆయన స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి పలుచోట్ల ఉన్న ఓట్లను తొలగించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమన్నారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు ఓటర్లుగా నమోదు కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయని, అందుకే అర్హులైన భారతీయ పౌరుల హక్కులను కాపాడటానికి ఈ ప్రక్షాళన అవసరమని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లేదా ఆస్తులకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని సూచించారు.అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఓటరు జాబితాల ప్రక్షాళనను రాజకీయ కోణంలో చూడకుండా, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను పెంచే చర్యగా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలేష్ గౌడ్‌తో పాటు పలువురు మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story