- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఇద్దరినీ మెప్పిస్తే అంతా కమర్షియలే.. ఆదాయానికి భారీగా గండి
తెలంగాణ రాష్ట్రానికే నిర్మాణ రంగంలో తలమానికంగా ఉన్న తెల్లాపూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసే విషయంలో టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలమవుతోంది.

దిశ, పటాన్ చెరు: గ్రేటర్ హైదరాబాద్ ను అనుకుని ఉన్న తెల్లాపూర్ మున్సిపాలిటీలో మహా నగరానికే తలమానికమైన నిర్మాణాలు సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి హంగులతో అన్ని అనుమతులతో భారీ అపార్ట్మెంట్లు నిర్మాణం జరుగుతుంటే మరొక పక్క అనుమతుల్లేకుండా అడ్డగోలు నిర్మాణాలు సైతం అదే స్థాయిలో జరుగుతుండడం గమనార్హం. ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారులు పక్కా కమర్షియల్ గా వ్యవహరిస్తున్నారు. గృహ నిర్మాణాల పేరుతో అనుమతులు తీసుకొని పెద్ద పెద్ద షెడ్లు, కమర్షియల్ షెటర్లు విరివిగా నిర్మాణం అవుతున్నాయి. కొన్ని చోట్ల ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. విలీన గ్రామాలలో పంచాయతీ అనుమతులతోనే ఇంకా నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన కీలక పట్టణ ప్రణాళిక విభాగం పడకేసింది. ఈ మున్సిపాలిటీ లో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడంతో సమస్య జటిలమవుతుంది. దీంతో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగి ప్రభుత్వ ఆదాయానికి భారీ గా గండి పడుతోంది.
అడ్డగోలుగా నిర్మాణాలు..
తెలంగాణ రాష్ట్రానికే నిర్మాణ రంగంలో తలమానికంగా ఉన్న తెల్లాపూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసే విషయంలో టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలమవుతోంది. గృహ నిర్మాణాల అనుమతులతో పెద్ద పెద్ద కమర్షియల్ షెడ్లను నిర్మిస్తున్నారు. విలీన గ్రామాలలో అయితే అక్రమ నిర్మాణాల విషయంలో పట్టింపే లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. తెల్లాపూర్ లోని రేడియల్ రోడ్లలో నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్లు వెలుస్తున్న అధికారులు ఆ నిర్మాణాలను ఆపే సాహసం చేయడం లేదు. ముత్తంగి లో జాతీయ రహదారి తో పాటు రైస్ మిల్లు రోడ్ లో గృహ నిర్మాణ అనుమతులతో కమర్షియల్ షెటర్ల నిర్మాణం జరుగుతున్న అనుమతులకు విరుద్ధంగా అడ్డగోలు నిర్మాణాలు సాగుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాల విషయంలో పిర్యాదులు వచ్చిన అధికారులు తొక్కి పెడుతున్నారనే వాదనలు సాగుతున్నాయి.
టౌన్ ప్లానింగ్ లో ఆ ఇద్దరిదే హవా..
తెల్లాపూర్ మున్సిపాలిటీలో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులదే పెత్తనమంతా నడుస్తుంది. తెల్లాపూర్ మున్సిపాలిటీ లో ఎక్కడ అక్రమ నిర్మాణం చేపట్టిన ఈ ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఇద్దరిని ప్రసన్నం చేసుకుంటే చాలు తమ నిర్మాణాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా సులువుగా పూర్తి చేసుకోవచ్చన్న భావనలో నిర్మాణధారులు ఉండడం విశేషం. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తె వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయడం లేదంటే నోటీసులు ఇచ్చి బెదిరింపులకు గురి చేసి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరిని కలిసి ప్రసన్నం చేసుకుంటే అక్రమాలన్ని సక్రమాలుగా మార్చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పిర్యాదులతో అధికారులు చర్యలు తీసుకుందామని ప్రయత్నం చేసిన ఈ తాత్కాలిక ఉద్యోగులు ఆ ప్రయత్నాలను భగ్నం చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
విలీన గ్రామాల్లో చేతి వాటం..
తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలు అధికారులకు జేబులు నింపే అక్షయ పాత్రలుగా మారాయనే చర్చ సాగుతోంది. ఈ విలీన గ్రామాలను ఒక ఇద్దరు అధికారులు తమ సంస్థానాలుగా భావిస్తూ కాసులను దండుకుంటున్నారనే వాదనలున్నాయి. ఒక పంచాయతీ కార్యదర్శితో పాటు మరొక మున్సిపల్ అధికారి కలిసి పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విలీన గ్రామాలలో గతంలో పని చేసిన అనుభవంతో మున్సిపాలిటీ కీలక అధికారులను మచ్చిక చేసుకుని అక్రమాలను చూసి చూడనట్లు వదిలేస్తూ దండిగా వాసులు చేస్తున్నారనే విమర్శలు స్థానికంగా సాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ లో తాత్కాలిక ఉద్యోగిని రంగంలో కి దింపి నిర్మాణ దారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు అసేస్మెంట్లు చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామంటూ భరోసా ఇస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే విలీన గ్రామాల రెవెన్యూను రెగ్యులర్ అధికారికి కాకుండా డివైడ్ చేసి మరొక అధికారికి కట్టబెట్టినట్లు సమాచారం. దీంతో ఆ ఇద్దరు అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట గా తమ పనులు చక్క బేట్టుకుంటున్నట్లు చర్చలు సాగుతున్నాయి. ఈ వ్యవహారం చూస్తుంటే మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు సాగుతున్నాయి. తాత్కాలిక ఉద్యోగుల పెత్తనం పై గతంలో సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి ఆ ఉద్యోగులను విధుల్లో నుంచి మార్చాలనే ఆదేశాలు జారీ చేసిన అప్పుడున్న మున్సిపల్ అధికారులు బేఖాతరు చేశారు. ఇప్పుడు అధికారులు మారినా ఇంకా ఆ ఉద్యోగులదే పూర్తి పెత్తనం నడుస్తుంది. ఆ ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులతో పాటు విలీన గ్రామాల్లో హవా నడిపిస్తున్న మరో ఇద్దరు అధికారుల తీరుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడే అవకాశాలున్నాయి. ఈ విషయంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య కల్పించుకుని మున్సిపాలిటీ వ్యవహారాలను చక్కబెట్టాలనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా మన్ననలు అందుకున్న కలెక్టర్ ప్రవీణ్య ఏ మేరకు తెల్లాపూర్ మున్సిపాలిటీ వ్యవహారం పై చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.






