నత్త నడకగా వివో భవనాల నిర్మాణం..!

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల గ్రామ సంఘాలు (వీవోలు) మరింత సమర్థవంతంగా పనిచేసేలా, గ్రామాలకు ఒక్కో వీవోకు ఒక్కో నూతన భవనం నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

నత్త నడకగా వివో భవనాల నిర్మాణం..!
X

దిశ, ఝరాసంగం : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల గ్రామ సంఘాలు (వీవోలు) మరింత సమర్థవంతంగా పనిచేసేలా, గ్రామాలకు ఒక్కో వీవోకు ఒక్కో నూతన భవనం నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ భవనాల్లో సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణతో పాటు మహిళల ఆర్థిక సాధికారతకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా భవనాలను మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని 33 గ్రామపంచాయతీల్లో 38 గ్రామ సంఘాలు ఉండగా సుమారు 746 మహిళా సంఘాల్లో దాదాపు 8 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరికి కోసం 38 వీవోలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 33 వీవో భవనాలను మంజూరు చేసింది. పెద్ద గ్రామాలైన ఝరాసంగం, ఎల్గోయి, కుప్పానగర్, బర్దిపూర్, బిడకన్య రెండు భవనాల చొప్పున మంజూరయ్యాయి. ఒక్క భవనానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించగా మొత్తం రూ.3.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇటీవల వివిధ గ్రామాల్లో భవన నిర్మాణాలు ప్రారంభమైనప్పటికీ, కొన్ని గ్రామాల్లో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో స్లాబ్‌ స్థాయి వరకు నిలిపి సంబంధిత కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. దీని పై ‘దిశ’ ఆరాతీస్తే, బిల్లులు విడుదల కాకపోవడమే ప్రధాన కారణమని తెలిసింది.

బర్దిపూర్, ఝరాసంగం, కుప్పానగర్, కప్పాడ్ తదితర గ్రామాల్లో ‘దిశ’ పరిశీలించగా, భవన నిర్మాణాలు సగం వరకు నిర్మించి వదిలిపెట్టిన దృశ్యాలు కనిపించాయి. మహిళల ఆర్థిక అభివృద్ధి, సంఘాల సమన్వయం, పొదుపు, రుణాల నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, జీవనోపాధి కార్యక్రమాల ప్రోత్సాహం, గ్రామస్థాయిలో మహిళల సాధికారత కోసం ఈ భవనాలు ఎంతో ఉపయోగపడనున్నాయని వీవోలు, మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. నిలిచిపోయిన నిర్మాణాలను వెంటనే పునఃప్రారంభించి త్వరగా పూర్తిచేసి ఉపయోగం లోకి తీసుకురావాలని ప్రభుత్వానికి అధికారులకు మహిళా సంఘాల సభ్యులు విజ్ఞప్తి చేశారు.

త్వరలో నిర్మాణం పనులు పూర్తి చేస్తాం.. పీఆర్ఏఈ శశిధర్ రెడ్డి

ఝరాసంగం మండలానికి 33 వీవో భవనాలు మంజూరయ్యాయి. ఇప్పటికే 23 పవని నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో పనులు పూర్తయ్యే దశకు చేరుకోగా, మరికొన్ని గ్రామాల్లో స్లాబ్‌ స్థాయి వరకు వచ్చి పనులు నిలిచిపోయిన విషయం వాస్తవమే. ఈ భవన నిర్మాణాల అంశంపై పై అధికారులకు నివేదిక పంపించి, త్వరలోనే పనులు ప్రారంభించి నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం మరో 10 భవనాలు నిర్మాణం పనులు వివిధ కారణాలతో ప్రారంభం కాలేదు.

Next Story