మానసిక వికలాంగుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు..

by Kodari Anjali |

నర్సాపూర్‌లోని వికాసం వికలాంగుల పునరావసకేంద్రాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి సందర్శించారు.

మానసిక వికలాంగుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు..
X

దిశ, నర్సాపూర్: బేతని మానసిక వికలాంగుల పిల్లల సంరక్షణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి నిర్వాహకులను హెచ్చరించారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రం, శివంపేటలోని బేతాని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, కమిషన్ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బేతాని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రంలో కేవలం మానసిక వికలాంగులకు వసతి, భోజనం సౌకర్యం కల్పిస్తే సరిపోదని వారికి మానసిక శారీరకంగా బుద్ధి, మాంద్యం, పరిజ్ఞానం పెంపొందించేందుకు కావలసిన చికిత్సలు అందించాలన్నారు. బేతాని సంరక్షణ కేంద్రం పనితీరును తరచూ సంక్షేమ శాఖ అధికారులు పరిశీలించాలని భవిష్యత్తులో సంరక్షణ కేంద్రం పనితీరు మెరుగుపరుచుకోవాలని అన్నారు.

అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆదర్శంగా తీర్చిదిద్దాలి..

అనంతరం మానసిక శారీరక, బుద్ధిమాంద్య వికలాంగుల పిల్లలకు అరటి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం టిక్యా తాండ అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడి పిల్లల విద్యాసామర్ధ్యాలను పరిశీలిస్తూ, జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆదర్శంగా తీర్చిదిద్దాలని వెల్లడించారు. ఉసిరిక పల్లి ఏరియాలో ఇటికబట్టిని పరిశీలించి బాల కార్మికులు ఎవరైనా బట్టీలలో పనిచేస్తున్నారా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు నర్సాపూర్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాల బాలికల సంరక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శారీరక వైకల్యం కలిగిన చిన్నారిని చూసి చిన్నారికి ఆపరేషన్ ద్వారా వైకల్యాన్ని సరిచేసి పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు.

భవిత కేంద్రాలు ఆదర్శవంతంగా పనిచేస్తున్నాయి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. పిల్లలపై దాడులను అరికట్టడానికి కమిషన్ కట్టుబడి ఉందని, ప్రతి ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి సంరక్షణ కేంద్రాల పనితీరును సమీక్షిస్తామని స్పష్టం చేశారు. భవిత కేంద్రాలు ఆదర్శవంతంగా పనిచేస్తున్నాయని, చిన్నారులకు ఆటపాటలతో కూడిన నైపుణ్యాలు నేర్పుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు వందన గౌడ్, చందన, అపర్ణ, వచన్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, సీడీపీఓ స్వరూప, సంబంధిత సంక్షేమ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story