- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 21న నీట్-యూజీ... ప్రశాంతంగా నిర్వహించాలి
జూన్ 21న జిల్లాలో నిర్వహించనున్న నీట్-యూజీ 2026 పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.

దిశ,సంగారెడ్డి అర్బన్: జూన్ 21న జిల్లాలో నిర్వహించనున్న నీట్-యూజీ 2026 పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్ష ఏర్పాట్లపై గురువారం జూమ్ ద్వారా సంబంధిత శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాల్లో 2,924 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానందున అత్యంత అప్రమత్తంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు తో ముడిపడి ఉన్న జాతీయ స్థాయి పరీక్ష కావడంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్య, ఫర్నిచర్, లైటింగ్, సీసీ కెమెరాల పనితీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయంగా జనరేటర్ ఏర్పాటు చేసుకోవాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులను కోరారు.
జిల్లాలో 9 సెంటర్లు, 2924 మంది అభ్యర్థులు...
ప్రతి పరీక్ష గదిలో వాల్ క్లాక్ ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన మేరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద ప్రాథమిక వైద్య సదుపాయాలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లా యంత్రాంగం నీట్ పరీక్షను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి సమగ్ర భద్రతా ప్రణాళిక సిద్ధం చేశామని, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలను పూర్తిగా చదివి, హాల్ టికెట్‌లో పేర్కొన్న సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అమలులో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు తదితర వస్తువులను తీసుకురావద్దని పేర్కొన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా నోడల్ అధికారి భారతి దేవి, జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్, వైద్య ఆరోగ్య, పోలీసు, ఆర్టీసీ, విద్యుత్, పోస్టల్, రెవెన్యూ శాఖల అధికారులు, తహసీల్దార్లు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.






