మోస్ట్ వాంటెడ్ చంద్రి అరెస్ట్

by Taduka Kalyani |

ఒకే ఒక్కడు ఏకంగా 105 దొంగతనాలు చేసి మోస్ట్ వాంటెడ్ నిందితుడుగా ఉన్నాడు.

మోస్ట్ వాంటెడ్ చంద్రి అరెస్ట్
X

దిశ, సంగారెడ్డి : ఒకే ఒక్కడు ఏకంగా 105 దొంగతనాలు చేసి మోస్ట్ వాంటెడ్ నిందితుడుగా ఉన్నాడు. చోరీలు చేయడమే అతడి నేర ప్రవృత్తిగా మార్చుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆ కేసుల్లో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా కూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కూడా నిందితుడు 14 నెలల పాటు జైలులో శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. ఇంతటి నేర చరిత్ర ఉన్న ఘరానా దొంగను సంగారెడ్డి జిల్లా పోలీసులు ఎట్టకేలకు నెల రోజులపాటు శ్రమించి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ పంకజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

తాళం వేసిన ఇండ్లే అతడి టార్గెట్

మహబూబ్ నగర్ జిల్లా బోయపల్లి గేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న కోటపల్లి చంద్రి అలియాస్ శేఖర్ (31) కారు డ్రైవర్ గా ఉంటున్నట్లే ఉంటూ రాత్రిళ్ళు దొంగతనాలు చేసేవాడు. అయితే 2009 నుంచి 2025 వరకు ఇప్పటివరకు మొత్తం 105 దొంగతనాలు చేశాడు. ఇందులో 30కి పైగా దొంగతనాలు కేవలం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చేయడం గమనార్హం. అయితే తాజాగా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా మూడు దొంగతనాలు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టి మంగళవారం అతడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 22.5 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, రూ. 25 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. కాగా నిందితుడిపై హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 80 పాత కేసులు (ఒక పోక్సో కేసు మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో), 26 కొత్త కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రావు, జిన్నారం సీఐ రమణ రెడ్డి, సీసీఎస్ ఎస్‌ఐ కె. శ్రీకాంత్, అలాగే గుమ్మడిదల ఎస్‌ఐ కె. అరుణ్ కుమార్ ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Next Story