మిషన్ భగీరథ నీటి కోసం గోస

by Taduka Kalyani |

మర్కుక్ మండల కేంద్రంతో పాటు పాములపర్తి తదితర గ్రామాల్లో గత వారం రోజులుగా మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మిషన్ భగీరథ నీటి కోసం గోస
X

దిశ, ములుగు: మర్కుక్ మండల కేంద్రంతో పాటు పాములపర్తి తదితర గ్రామాల్లో గత వారం రోజులుగా మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించామని చెప్పినా, ప్రస్తుతం వారం రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, మహిళలు, వృద్ధులు తాగునీటితో పాటు స్నానాలు, ఇతర గృహావసరాల కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ప్రస్తుతం గ్రామాల్లో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో నీటి కొరత మరింత తీవ్రంగా మారిందని గ్రామస్తులు తెలిపారు. మండల కేంద్రం మర్కుక్‌లో గత ఐదు రోజులుగా, పాములపర్తిలో తొమ్మిది రోజులుగా బోనాలు, బొడ్రాయి ఉత్సవాలు జరుగుతుండగా ఇతర గ్రామాల నుంచి బంధువులు రావడంతో నీటి అవసరం మరింత పెరిగిందన్నారు. ఈ సమస్యపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోయిందని బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయం లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ, వెంటనే మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

మిషన్ భగీరథ ఏఈ భానుప్రియ స్పందన

గ్రామాల్లోని వాటర్ ట్యాంకులకు సకాలంలో నీటిని సరఫరా చేస్తున్నామని, అయితే అప్పుడప్పుడు పైపులైన్ దెబ్బతినడం వంటి సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని మిషన్ భగీరథ ఏఈ భానుప్రియ తెలిపారు. సమస్యను గుర్తించి వెంటనే మరమ్మతు పనులు చేపట్టి, వీలైనంత త్వరగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Next Story