కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలి : బొల్లం మల్లయ్య యాదవ్

by Batti.Sumithra |

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించి, కోదాడ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలి : బొల్లం మల్లయ్య యాదవ్
X

దిశ, మోతే : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించి, కోదాడ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మోతే మండలం రాఘవాపురం ఎక్స్‌రోడ్ వద్ద పంట కాలువలను పరిశీలించిన ఆయన, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యాన్ని, ముఖ్యంగా కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని ప్రజలకు వివరించినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు తెలంగాణ వ్యవసాయ రంగానికి జీవనాడిగా నిలిచాయని, వాటిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్లు, ప్రమాదాల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి కోదాడ ప్రాంతానికి సాగునీరు అందించడంతో పాటు చెరువుల పునరుద్ధరణ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపులను పక్కనబెట్టి వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి రైతులకు సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మోతే మండల అధ్యక్షుడు శీలం సైదులు, మాజీ ఎంపీపీ అరె లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి, రాఘవాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు కారింగుల సత్యనారాయణ, రైతు నాయకుడు కిరణ్, స్థానిక నాయకులు, రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story