- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రెవెన్యూ, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మహర్దశ
రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు ఆధునిక సేవలు అందించాలనే లక్ష్యంతో దశల వారీగా తహశీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు ఆధునిక సేవలు అందించాలనే లక్ష్యంతో దశల వారీగా తహశీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భవనాల నిర్మాణాలపై మంగళవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న 107 తహశీల్దార్ కార్యాలయాలు, 10 ఆర్డీవో కార్యాలయాలకు రూ.263 కోట్లతో, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి రూ.97 కోట్లతో 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో డీఐజీ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తం భవనాల కోసం రెండు విభాగాలకు సంబంధించి రూ.360 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ భవనాలన్నీ ఒకే నమూనాలో, ఆధునిక సౌకర్యాలతో నిర్మించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రూపొందిస్తామని చెప్పారు. వీటి నిర్మాణ బాధ్యతను తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
శాశ్వత పరిష్కారం..
అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. హౌజింగ్ అధికారులు జిల్లా స్ధాయిలో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని కొత్త భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి, నిర్మాణ పనులను వేగంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలందించే కార్యాలయాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించబడతాయని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 13 క్లస్టర్‌లుగా విభజించి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని, ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థలతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఐదు సంవత్సరాల నిర్వహణ బాధ్యతను కూడా ఆ సంస్థలే తీసుకున్నాయని, ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్ధాపన చేయగా, నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.






