‘ప్రజాపాలనతోనే ప్రగతి సాధ్యం’: మంత్రి పొన్నం ప్రభాకర్

by Kodari Anjali |

హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని నియోజకవర్గ స్థాయి ‘ప్రగతి ప్రణాళిక’లో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

‘ప్రజాపాలనతోనే ప్రగతి సాధ్యం’: మంత్రి పొన్నం ప్రభాకర్
X

​దిశ, హుస్నాబాద్: ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన రెండున్నరేళ్ల కాలంలోనే హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించిన ‘హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆర్డీవో రామ్మూర్తి ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.

మత్తు వద్దు.. భవిష్యత్తు ముద్దు

​మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా నిర్వహించిన 'మాదకద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవం'లో మంత్రి మాట్లాడుతూ.. యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు. "క్షణికానందం కోసం మత్తు పదార్థాలకు బానిసలై తల్లిదండ్రుల కలలను, మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. గంజాయి రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసమే సిద్దిపేట కమిషనరేట్‌లో డ్రగ్స్ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, రవాణా చేసినా డయల్ 100కు సమాచారం అందించాలి" అని పిలుపునిచ్చారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజం కోసం అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేసి, గోడపత్రికలను విడుదల చేశారు.

​గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిగా నా బాధ్యత..

​హుస్నాబాద్ ప్రాంత రైతాంగ సుభిక్షం కోసం గౌరవెల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం తన ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అందాల్సిన పరిహారం చెల్లింపులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేస్తామని, త్వరలోనే కాల్వల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

​సంక్షేమ పథకాల వెల్లువ..

​నియోజకవర్గంలో రూ. 250 కోట్ల రైతు భరోసా, 679 రైతు కుటుంబాలకు రూ. 49.96 కోట్ల బీమా అందజేసి అండగా నిలిచామన్నారు. రూ. 150 కోట్లతో 3,515 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇప్పటికే లబ్ధిదారులకు రూ. 74 కోట్లు చెల్లించామన్నారు. త్వరలోనే కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 250 పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ పనులను వేగవంతం చేస్తామన్నారు.

​అనారోగ్య రహిత సమాజమే లక్ష్యం..

​జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు. సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ.. 'సురక్ష నేత్రం' కింద ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు రూ. 128 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి శారద, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story