‘పాడిపంటలు, పారిశ్రామికాభివృద్ధే లక్ష్యం’: మంత్రి పొన్నం ప్రభాకర్

by Kodari Anjali |

మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం పొతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.

‘పాడిపంటలు, పారిశ్రామికాభివృద్ధే లక్ష్యం’: మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పశుసంపదను పటిష్టం చేస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రజా పాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం పొతారం (ఎస్) గ్రామంలో పర్యటించిన మంత్రి, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ (FMD) టీకాల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకోసారి పశువులకు టీకాలు వేయడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని, రైతులు పాడి సంపదపై దృష్టి సారించాలని సూచించారు. తన క్యాంప్ కార్యాలయంలో ఉన్న జెర్సీ ఆవు ఆరు లీటర్ల పాలు ఇస్తోందని ఉదాహరిస్తూ, పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చుకోవాలని కోరారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరమేశ్వర సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీని ప్రారంభించిన మంత్రి, మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికతో గ్రామాల్లో మార్పు తెస్తున్నామని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంకులను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

Next Story