బీజేపీ నేతలారా అప్పుడు కాదు.. ఇప్పుడేమంటారు?: మంత్రి హరీష్ రావు

by Web Desk |
బీజేపీ నేతలారా అప్పుడు కాదు.. ఇప్పుడేమంటారు?: మంత్రి హరీష్ రావు
X

దిశ, సంగారెడ్డి ప్రతినిధి: దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్​ సారథ్యంలోని టీఆర్ఎస్​ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే నోరుందికదా అని బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఈ పథకం కేవలం హుజురాబాద్​ ఉప ఎన్నికల కోసమే తీసుకువచ్చారని ఆ పార్టీ నేతలు విమర్శలు చేశారు. పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి బీజేపీ నేతలు ఇప్పుడేమంటారని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్​రావు సూటిగా ప్రశ్నించారు.

ఆదివారం దళిత బంధు పథకం అమలుపై సంగారెడ్డి కలెక్టరేట్​లో ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మాట ఇచ్చిన ప్రకారం సీఎం కేసీఆర్​ దళిత బంధు అందిస్తున్నారని చెప్పారు. మిషన్​ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్రంలో హర్​ఘర్​జల్​పథకం, అలాగే రైతు బంధును చూసి కిసాన్​ సమ్మాన్​ యోజన పేరుతో పథకాలు తీసుకువచ్చినట్లుగానే దళిత బంధు పథకాన్ని కేంద్రం అమలు చేయాలని హరీష్​రావు డిమాండ్​ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది దళితులను దళిత బంధుకు ఎంపిక చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వచ్చే నెల ఫిబ్రవరి 5 లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

మార్చి మొదటి యూనిట్ల గ్రౌండింగ్​కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తిచేయాలని హరీష్​రావు సూచించారు. దేశంలో 26 కోట్ల దళితులకు బడ్జెట్​ కేటాయింపులు పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ను హరీష్​రావు డిమాండ్​ చేశారు. గడచిన పదేళ్లలో దళితుల అభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.6,198 కోట్లు ఖర్చుపెడితే ఏడున్నరేళ్లలో టీఆర్ఎస్​ సర్కారు రూ. 24,114 కోట్లు ఖర్చు చేసింది చెప్పారు. ఎలాంటి అప్పు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే 10 లక్షల గ్రాంటు అందిస్తున్నదని, ఈ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తున్నదని వెల్లడించారు. దశల వారీగా నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. అందరూ ఒకే రంగాన్ని ఎంచుకోకుండా వివిధ రంగాలకు సంబంధించిన యూనిట్లు ఎంపిక చేసుకునే విధంగా అధికారులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని సూచించారు.

ఇదిలా ఉండగా విద్యారంగంలోని పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం రూ.7,280 కోట్లతో మన ఊరు – మన బడి కార్యక్రమం చేపడుతుందన్నారు. కార్పొరేట్​కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్​ సర్కారు పనిచేస్తున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్​ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. మంచి చేయకపోయిన వారు చెడు చేయకపోతే చాలని సూచించారు. ఆర్మీలో ఖాళీగా ఉన్న మూడు లక్షల ఉద్యోగాలను కేంద్ర సర్కారు తక్షణమే భర్తీ చేయాలని హరీష్​రావు డిమాండ్​ చేశారు. కేంద్ర తన ఆధీనంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం విద్యకు కేటాయించిన బడ్జెట్లో రూ.3 వేల కోట్లు తగ్గాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్​ చైర్​పర్సన్​మంజుశ్రీ జైపాల్​రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్. ఎమ్మెల్యేలు భూపాల్​రెడ్డి, మాణిక్​రావు, క్రాంతి కిరణ్​, జగ్గారెడ్డి, డీసీసీబీ చైర్మన్​ చిట్టి దేవేందర్​రెడ్డి, డీసీఎంఎస్​చైర్మన్​ శివకుమార్​, అదనపు కలెక్టర్​ వీరారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed