మాణిక్యం ప్రకటనపై మంత్రి హరీష్ రావు సీరియస్.. బర్త్ డే పేరుతో హంగామా చేయబోతే అసలుకే ఎసరు..!

by Disha Web Desk 19 |
మాణిక్యం ప్రకటనపై మంత్రి హరీష్ రావు సీరియస్.. బర్త్ డే పేరుతో హంగామా చేయబోతే అసలుకే ఎసరు..!
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: జన్మదిన వేడుక పేరుతో హంగామా సృష్టించాలనుకుంటే అసలుకే ఎసరు వచ్చింది. తన పుట్టిన రోజు వేడుకలకు తప్పకుండా రావాలని మంత్రితో సహా అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలనందరినీ ఆ నేత ఆహ్వానించాడు. అందరు కూడా కార్యక్రమం వద్దకు వస్తూ ఓ విషయం తెలిసి మద్యనుంచే వెనుతిరిగి వెళ్లిపోయారు. మంత్రితో సహా ముఖ్య నాయకులు రాకపోవడంతో సదరు నేత ఒక్కసారిగా షాక్ తిన్నారు. తానే బీఆర్ఎస్ అభ్యర్థినంటూ ఆ లీడర్ బర్త్ డే వేడుకల్లో చెప్పుకోవడమే ఇందుకు కారణమైంది.

ముఖ్యులేవరూ రాకపోవడంతో కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అభ్యర్థులను ప్రకటించిన తరువాత తానే అభ్యర్థినంటూ ఆ లీడర్ ప్రకటించుకోవడంపై మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. అంతే కాకుండా బీఆర్ఎస్ లీడర్లు ఎవరు కూడా పార్టీ లైన్ దాటవద్దని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసినట్లు పార్టీ ముఖ్య నాయకుల ద్వారా తెలిసింది. ఇది జరిగింది జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో.. ఆ లీడర్ ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం. ఈ వ్యవహారం సంగారెడ్డి అధికార పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

తన పుట్టిన రోజుకు రావాలని..

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం బీఆర్ఎస్ నుంచి సంగారెడ్డి టికెట్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా సిట్టింగ్ లకు మరో సారి అవకాశం కల్పించారు. సంగారెడ్డి స్థానానికి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేరు ఖరారు చేశారు. అయితే ప్రభాకర్ పేరు ప్రకటించినప్పటికీ మాణిక్యం మాత్రం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తన ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా 22న శుక్రవారం తన పుట్టిన రోజు కావడంతో కార్యక్రమంలో కొంత హంగామా సృష్టించాలనుకున్నారు. ఈ మేరకు గత 15 రోజుల నుంచే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు పెట్టారు. ఫంక్షన్ హాల్స్ బుక్ చేశారు. జిల్లా మంత్రి హరీష్ రావుతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్, ఇతర విభాగాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరితో పాటు జిల్లా కలెక్టర్ ఇతర శాఖల అధికారులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రత్యేక ప్రింట్ చేయించిన పత్రికలను ఆయనే స్వయంగా మంత్రికి, ఇతరులకు అందించారు.

వ్యవహారం ఇలా అడ్డం తిరిగింది..

సంగారెడ్డిలో పెద్ద ఎత్తున మాణిక్యం బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు. మంత్రి మొదలుకుని ప్రజా ప్రతినిధులంతా హాజరవుతారని మాణిక్యం అశించారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నేరుగా ఫంక్షన్ హాలుకు ర్యాలీ చేరుకున్నది. అయితే అక్కడ తానే సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థినంటూ స్వయంగా ప్రకటించుకున్నారు. ఇంకా ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు ఎవరూ కార్యక్రమ వేదిక వద్దకు రాకముందే ఈ విషయంలో సోషల్ మీడియాలో ప్రచారం అయ్యింది.

తానే ఎమ్మెల్యే అభ్యర్థి నంటూ విస్త్రతంగా ప్రచారం కావడంతో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న వారందరికీ ఓ మేసేజ్ వెళ్లడంతో అందరూ వెనుతిరిగారు. తాను అభ్యర్థినంటూ ప్రచారం చేసుకునే సభకు వెళితే సీఎం కేసీఆర్ ప్రకటనకు అర్థం ఉండదని, పార్టీ శ్రేణులకు తప్పడు సంకేతాలు వెళతాయని బావించి నాయకులు ఎవరు కూడా అటువైపు రాలేకపోయారు.

వెనుతిరిగి మంత్రి హరీష్ రావు..

మాణిక్యం పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి మంత్రి హరీష్ రావు, ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులతో కలిసి బయలుదేరారు. వాహనాలు రింగురోడ్డు నుంచి ముత్తంగి వరకు చేరుకుంటున్న సమయంలోనే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వార్తను ఇతర నాయకులు గుర్తించి మంత్రికి సమాచారం అందించారు. తానే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ మాణిక్యం ప్రకటించుకోవడంపై ఒక్కసారిగా మంత్రి సీరియస్ అయ్యారు. అప్పటికప్పుడు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని తిరిగి వెళ్లిపోయినట్లు ఆయన వెంట ఉన్న ముఖ్య నాయకులు తెలిపారు. జిల్లా మంత్రిగా తాను ఆ కార్యక్రమానికి వెళ్లడం ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయని భావించి మంత్రితో పాటు ముఖ్య నాయకులంతా వెనుతిరిగారు.

వాహనాలను తానే ప్రారంభించుకున్నారు..

తన పుట్టిన రోజును పురస్కరించుకుని మాణిక్యం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్, ఐదుగురు వికలాంగులకు మూడు చక్రాలు స్కూటీలు, 50 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. వీటిని మంత్రి హరీష్ రావుతో అందించాలని నిర్ణయించి బారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో మంత్రి, ఇతర నేతలు రాకపోవడంతో షాక్ తిన్న మాణిక్యం అంబులెన్స్ ను ఆయన ప్రారంబించుకోవాల్సి వచ్చింది. స్కూటీలు, కుట్టుమిషన్లను ఆయన పంపిణీ చేశారు. ఒక్కసారిగా కార్యక్రమానికి ముఖ్యులు రాకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందారు. తానే అభ్యర్థినని ప్రకటించుకుని తప్పు చేశారని అప్పటి వరకు బర్త్ డే ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు కూడా మాణిక్యంను తప్పుపడుతూ చర్చించుకున్నారు.

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు..

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులకు మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ప్రకటనకు కూడా విలువ ఇవ్వకపోతే ఎలా అని ఆయన మండిపడ్డారు. సీఎం అభ్యర్థిని ప్రకటించిన తరువాత తానే అభ్యర్థినంటూ ఎలా ప్రకటించుకుంటారని హరీష్ రావు ఆగ్రహించినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే సంగారెడ్డి నియోజకవర్గంలోని ఉద్యమకారులు, ఇతర నాయకులతో మంత్రి హరీష్ రావు సమీక్షించి చింతా ప్రభాకర్ ను గెలిపించాలని, ఆయన కోసం అందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇలా ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుని ప్రకటనలు చేస్తే ఇంకా అధిష్టానం ఎందుకని కొందరు సంగారెడ్డి నాయకులతో సీరియస్ అయినట్లు తెలిసిందే. అయితే మంత్రి సీరియస్ కావడం, కార్యక్రమానికి ముఖ్య నాయకులు ఎవరూ రాకపోవడవంతో అప్పటి వరకు మాణిక్యం వైపు ఉన్న కొందరు నాయకులు ఒక్కక్కరుగా తిరిగి చింతా ప్రభాకర్ వైపు వెళ్లిపోయారు. ఈ టోటల్ వ్యవహారంతో షాక్ కు గురైన మాణిక్యం తన తదుపరి నిర్ణయం ఎలా ఉండబోనున్నదనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముఖ్య నాయకులు ఎవరు హాజరుకాకపోగా చింతా ప్రభాకర్ మాత్రం కార్యక్రమం వద్దకు అలా వెళ్లి ఇలా తిరిగి రావడం కొసమెరుపు.

Read More: భద్రాద్రిలో ముక్కోణపు పోటీ..?

Next Story