‘ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తాం’: మంత్రి దామోదర రాజనర్సింహ

by Kodari Anjali |

అంగన్‌వాడీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు.

‘ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తాం’: మంత్రి దామోదర రాజనర్సింహ
X

దిశ, అందోల్‌: జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో కనీసం 50 శాతం వరకు స్వంత భవనాలను నిర్మించుకుందామని, అద్దె భవనాలు వద్దని, స్వంత భవనాలే ముద్దు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. మంగళవారం జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జోగిపేట–ఆందోల్‌ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ గార్డెన్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2300 అంగన్‌వాడీ కేంద్రాలకు కేవలం 900 వరకు మాత్రమే స్వంత భవనాలు ఉన్నాయని, మిగతా 1400 కేంద్రాలలో 50 శాతం వరకు మౌలిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యకు అంగన్‌వాడీ కేంద్రాలే పునాదీ అని ఆయన తెలిపారు.

మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి..

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీల పాత్ర మరవలేనిదని, మీ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, ఆయాలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనబడితే ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆయన హెచ్చరించారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పెరిగే వరకు తల్లి–బిడ్డ క్షేమం కోసం పోషక విలువలను అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలేనన్నారు. మహిళా విద్యతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా, టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ది ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. జోగిపేటలో రూ.6 కోట్లతో సీడీపీవో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, మరో ఆరు మాసాల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు. అనంతరం జోగిపేట ఐసీడీఎస్‌ పరిధిలోని 286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ ఫోన్‌లను పంపిణీ చేశారు.

దివ్యాంగులకు ఉచిత స్కూటీల అందజేత..

దివ్వాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఉచితంగా స్కూటీలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 10 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీలను మంత్రి దామోదర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్‌.కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఎ.చిట్టిబాబు, అడిషనల్‌ కలెక్టర్‌ పాండు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, డీఎంహెచ్‌ఓ వసంత్‌రావు, మార్కెట్‌ చైర్మన్‌ ఎం.జగన్మొహన్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యాక్షుడు సంగమేశ్వర్, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్, దివ్వాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షఫీ, జోగిపేట సీడీపీఓ ప్రియాంక, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, టీచర్లు, దివ్యాంగులు, ఇతరులు పాల్గొన్నారు.

Next Story