జ్యోతిబాపూలే బాలికల పాఠశాల తరలింపు రద్దు చేయాలి

by Taduka Kalyani |

మండలం శేరిపల్లి బందారం మొండి చింత వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను మిరుదొడ్డి మండల కేంద్రానికి తరలించే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.

జ్యోతిబాపూలే బాలికల పాఠశాల తరలింపు రద్దు చేయాలి
X

దిశ,దౌల్తాబాద్: మండలం శేరిపల్లి బందారం మొండి చింత వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను మిరుదొడ్డి మండల కేంద్రానికి తరలించే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులకు అవసరమైన వసతులు అందుబాటులో ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో పాఠశాలను తరలించడం వల్ల బాలికల చదువుకు తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. మిరుదొడ్డిలో తాత్కాలిక భవనంలో పాఠశాలను నిర్వహిస్తే డైనింగ్ హాల్, ఆట స్థలం, ప్రహరీ గోడ వంటి కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలకు ప్రతిరోజూ రాకపోకల సమస్యలు ఏర్పడటంతో పాటు భద్రతా పరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల కొంతమంది విద్యార్థినులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలను ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే యధాతథంగా కొనసాగించాలని, తరలింపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు అధికారులను కోరారు. బాలికల విద్యకు భంగం కలిగించే నిర్ణయాలను పునఃపరిశీలించి, వారి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.

Next Story