- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు నష్టపోవద్దు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు
వర్షభావ పరిస్థితులపై కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటలు, సీజనల్ వ్యాధులపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తితే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జిల్లా వారీగా ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలను (Contingency Cropping Plans) సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయం నుంచి వ్యవసాయం, ఆరోగ్యం, తాగునీరు, విద్యా శాఖల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో కలిసి ఒక ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖల అగ్ర అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. వర్షాలు తగ్గితే రైతులు నష్టపోకుండా ఉండేందుకు తగిన సమయాల్లో వారకి మార్గదర్శకాలను అందజేయాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల లభ్యత, పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతన్నల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వీలుగా హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తీసుకునే ముందస్తు చర్యల వల్ల సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. అలాగే వాతావరణ మార్పుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని కలెక్టర్లను కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించే విషయాన్ని ప్రాధాన్యత అంశంగా పెట్టుకోవాలన్నారు.
అనువైన స్థలాలను గుర్తించండి:
విద్యాశాఖ సమీక్షలో భాగంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి అవసరమైన వంటశాలల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని సంజయ్ జాజు కలెక్టర్లకు సూచించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రాధాన్యత అంశాలపై క్షేత్రస్థాయి అమలును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సీఎస్ స్పష్టం చేశారు.






