"సీఎం"ను అడిగి.. రూ.200 కోట్ల నిధులు తీసుకువస్తా

by velandi.Saikiran |

సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి అడిగి రూ.200 కోట్ల నిధులు తీసుకు వస్తానని జగ్గారెడ్డి

సీఎంను అడిగి.. రూ.200 కోట్ల నిధులు తీసుకువస్తా
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అడిగి రూ.200 కోట్ల నిధులు తీసుకు వస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో సెక్రటేరియట్ లో జగ్గారెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదాశివపేట మున్సిపాలిటీలో మిషన్ భగీరథ వాటర్ ఫిల్టర్ కావడం లేదని, సరిపడ నీరు రావడం లేదన్నారు. సదాశివపేట మున్సిపాలిటీ లో కొత్త కాలనీలు వచ్చాయని, జనాభా పెరిగిందని ఆ స్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఎటిగడ్డ సంఘం వద్ద ఫిల్టర్ బెడ్, సదాశివ పేట శివారులో ఇంటెక్ వెల్ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి అధికారులకు సూచించారు.

ఏటి గడ్డ సంగం బదులుగా నేరుగా సింగూర్ నుంచి నీటిని తరలిస్తే ఉపయోగం ఉంటుందని అధికారుల సూచించారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక చేయాలని అధికారులకు జగ్గారెడ్డి చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా కాకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వయంగా నీటి సరఫరా జరాగాలని, మూడు కాలనీలకు ఒక టాంక్ చొప్పున ఆరు లక్షల గ్యాలన్ ల కెపాసిటీతో ఏర్పాటు చేయాలన్నారు.

జనాభాకు అనుగుణంగా మొత్తం 11 ట్యాంకుల నిర్మాణం చేయాలని జగ్గారెడ్డికి అధికారులు పరిస్థితిని వివరించారు. రోజూ ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున నీరు సరఫరా జరాగాలన్నారు. మొదటి ఫ్లోర్ కు సైతం నీరు ఎక్కెలా ప్రెషర్ తో సరఫరా చేసేలా డిజైన్ చేయాలని, ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ ను ఏర్పాటు చేసుకుని డిజైన్ లు చేయాలని అధికారులకు సూచించారు. ఆ ఖర్చు నేను భరిస్తానని, ఇప్పుడున్న సిబ్బంది డిజైన్ చేయలేరని, కన్సల్టెంట్ ను నియమించుకోవాలన్నారు. సదాశివపేట పట్టణంలో అవసరమైన చోట పాత ట్యాంక్ లు, డిస్ట్రిబ్యూషన్ లైన్ ల స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని సూచించారు.

Next Story