- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసైన్డ్ భూమికి ఎసరు.. అక్రమంగా రిజిస్ట్రేషన్
అక్కడ వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ భూమిలో కొంత భాగం ప్రభుత్వానికి ఉంచుకొని మిగతా 90శాతం నిరుపేదలకు, మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించింది.

దిశ, సంగారెడ్డి: అక్కడ వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ భూమిలో కొంత భాగం ప్రభుత్వానికి ఉంచుకొని మిగతా 90శాతం నిరుపేదలకు, మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించింది. అయితే రాబోయే రోజుల్లో అక్కడ ఉన్న భూమికి కోట్లల్లో రేటు పలుకుతుందనే విషయాన్ని ముందే పసిగట్టిన కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆ ప్రభుత్వ భూమిని అక్రమంగా కాజేసేందుకు ఎసరు పెట్టారు. ఏకంగా ఆరు ఎకరాల భూమికి స్పాట్ పెట్టి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకొని అక్రమంగా వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ తంగమంతా 24 ఏళ్ల క్రితం జరిగింది. తాజాగా రెవెన్యూ అధికారులు తీగలాగితే అసలు డొంక బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
6 ఎకరాలకు స్పాట్..
సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని చేర్యాల గ్రామ శివారు ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ పక్కన సర్వే నెంబర్ 268లో మొత్తం 155 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 44 ఎకరాలను మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించి అందజేసింది. మిగతా 96 ఎకరాలను 1994లో అప్పటి ప్రభుత్వం అక్కడ ఉండే నిరుపేదలకు అసైన్డ్ చేసింది. ప్రస్తుతం అక్కడ 15 ఎకరాల భూమి మాత్రమే ప్రభుత్వానికి చెందినదిగా ఉన్నది. అయితే ఇదే సర్వే నంబర్ లోని ఎల్లా గౌడ్, వీర గౌడ్ లకు కేటాయించిన 6 ఎకరాలు భూమి కూడా ఉంది. ప్రభుత్వం వారికి కేటాయించిన ఆ భూమిని తల మూడు ఎకరాలు కలిపి మొత్తం 6 ఎకరాలను 2000 సంవత్సరంలో సంగారెడ్డికి చెందిన పెంటోజి, వినోద్ కుమార్ పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా అక్రమంగానే జరిగింది. అప్పటి నుంచి ఆ భూమిపై పూర్తి హక్కులు తమవేనంటూ సదరు ప్రైవేటు వ్యక్తులు కబ్జాలో ఉన్నారు.
తీగ లాగితే కదిలిన అసలు డొంక..
కంది మండల తహసీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి..? అన్యాక్రాంతం ఎక్కడ అయ్యాయి..? అనే విషయాలను రెవెన్యూ సిబ్బంది లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వే నంబర్ 268లో ఆరు ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు గుర్తించారు.వెంటనే స్థానిక పోలీసు యంత్రాంగం సహకారంతో తాసిల్దార్ రవికుమార్ అతని సిబ్బంది శనివారం అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. వెంటనే అక్కడ హద్దులు పాతించేలా ఏర్పాట్లు చేసి ఆ ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.30 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇకపై ఎవరైనా ప్రభుత్వ భూములు అమ్మినా, కొన్నా చట్టపరయమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాసిల్దార్ రవికుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇదే కంది మండల పరిధిలో మరికొన్ని చోట్ల ఈ విధమైన అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయినట్లు రెవెన్యూ అధికారులకు దృష్టికి ఇప్పటికే వచ్చింది. వాటిని కూడా గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు.
సంగారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కేంద్రంగా..
సంగారెడ్డి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కేంద్రంగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ దందా జరిగినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. 2000 సంవత్సరంలో అప్పటి రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కొంత మంది అధికారులు ఇతర మధ్యవర్తుల ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగినట్టు వారి విచారణలో బయటికి వచ్చింది. మొత్తానికి రెవెన్యూ అధికారుల ప్రత్యేక కృషితో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి తిరిగి స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






