- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
14-15 ఏళ్ల ఆడపిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి
గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను జిల్లాలోని 14-15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలందరూ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు.

దిశ,సంగారెడ్డి అర్బన్: గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను జిల్లాలోని 14-15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలందరూ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు.హెచ్‌పీవీ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించడంలో అత్యంతప్రభావవంతమైనది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు, భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇప్పటివరకు 2,786 మందికే
జిల్లాలో 14-15 సంవత్సరాల మధ్య వయస్సు గల మొత్తం 12,635 మంది బాలికలు ఉండగా, ఇప్పటివరకు 2,786 మంది మాత్రమే హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకున్నారని కలెక్టర్ తెలిపారు. మిగిలిన అర్హులైన బాలికలకు వ్యాక్సిన్ అందేలా మిషన్ మోడ్‌లో వ్యాక్సినేషన్ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎక్కడ అందుబాటులో?
ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా అందిస్తోంది. సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు టీవీవీపీ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది అని కలెక్టర్ వివరించారు.విద్యాశాఖ, రెసిడెన్షియల్ విద్యాసంస్థల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించి, వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.హెచ్‌పీవీ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ప్రజలు అపోహలను నమ్మకుండా వైద్య నిపుణుల సూచనలను పాటించాలి. ప్రతి బాలిక ఈ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి అని కలెక్టర్ కోరారు.






