- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు చేకూరుతాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వెల్లడించారు.

దిశ, నర్సాపూర్ : సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు చేకూరుతాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వెల్లడించారు. గురువారం మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని ఉసిరిక పల్లి గ్రామంలో పోతరాజుల బాలేష్ అనే రైతు తన నాలుగున్నర ఎకరాల పొలంలో సాగు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ పంటలను,సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులు సాగు చేస్తున్న పంటలను జిల్లా కలెక్టర్ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయడం అభినందనీయమన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల సారవంతం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందించడంలో సేంద్రియ వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రైతులు తయారు చేస్తున్న జీవామృతం, ఘన జీవామృతం, వర్మీ కంపోస్ట్, సేంద్రియ కషాయాలు తదితర సహజ ఎరువులు తయారీ విధానాలను కలెక్టర్ పరిశీలించారు. పంటల ఎదుగుదల, దిగుబడి పరిస్థితులు, సాగు ఖర్చులు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు మరింత ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సాంకేతిక సూచనలు అందిస్తూ సేంద్రియ సాగును విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు), రైతు వేదికల ద్వారా సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ఆదర్శ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసి ఇతర రైతులకు ప్రేరణ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, మండల వ్యవసాయ అధికారిణి లావణ్య, సాంకేతిక వ్యవసాయ అధికారి యాదగిరి, వ్యవసాయ విస్తరణ అధికారిణి సౌజన్య, రైతులు పాల్గొన్నారు.






