- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మారిన పటాన్‌చెరు రాజకీయాలు...గూడెం కారెక్కడం ఖాయమేనా?
మహిపాల్‌రెడ్డి కామెంట్స్‌తో ఆయన నిష్క్రమణ తర్వాత పార్టీ బాధ్యతలు స్వీకరించిన ఆదర్శ్ రెడ్డి వర్గం గందరగోళంలో పడింది.

కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా...
గూడెం మహిపాల్‌రెడ్డి సంచలన కామెంట్స్
బీఅర్ఎస్ అభ్యర్థులనే గెలిపించుకుందామని ఎమ్మెల్యే పిలుపు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శ్రేణులతో వరుస సమావేశాలు
మారుతున్న పటాన్‌చెరు రాజకీయ పరిణామాలు
దిశ, పటాన్‌చెరు : కాంగ్రెస్ కండువా కప్పుకొని తప్పు చేశానని పటాన్‌చెరు ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం రేపుతున్నాయి. బీఆర్ఎస్‌లో గెలిచి అధికార పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినా వెంట్రుక మందం కూడా ప్రయోజనం లేదంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్‌చెరు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కారు గుర్తుపై గెలిచి హస్తం గూటికి చేరి అనూహ్యంగా యూటర్న్ తీసుకున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆదివారం మనసులో మాటను బయటపెట్టాడు. జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో అభిమానులు, అనుచరులతో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో గూడెం కాంగ్రెస్ పార్టీపై భగ్గుమన్నారు. అధికార పార్టీలో చేరినా కేసులు న్యాయపరంగానే ఎదుర్కొంటున్నాని స్పష్టం చేశారు. మూడు సార్లు బీఆర్ఎస్ తనకు టిక్కెట్ ఇచ్చి గెలిపించిందని ఆ పార్టీపై ప్రేమను కురిపించారు. తన గెలుపు కోసం పనిచేసిన నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకుంటానన్నారు. గులాబీ పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్ధులకే తన మద్దతు ఉంటుందని, ప్రజాక్షేత్రంలో తిరిగి నన్ను నమ్ముకున్న నాయకుల గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కారెక్కడం ఖాయమేనా?
ఎమ్మెల్యే గూడెం తిరిగి సొంతగూటికి చేరడం ఖాయమనే చర్చ సాగుతోంది. అందుకు తగినట్లుగానే గతనెల రోజులుగా సాగుతున్న పరిణామాలు సంకేతాలిస్తే.. తాజాగా మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ఆయన చేరికను స్పష్టం చేసినట్లైంది. గూడెం ఎన్నికల సన్నాహక సమావేశాలకు మెజార్టీ బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఇప్పటికే తనతో పాటు కాంగ్రెస్‌లో చేరిన కొందరు నాయకులు సైతం బీఆర్ఎస్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే వర్గంతో కలిసి గులాబీ పార్టీలో చేరికకు సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఎమ్మెల్యే గూడెం చేసినా వ్యాఖ్యలతో ఎమ్మెల్యే సైతం కారెక్కడం ఖాయమనే సాగిన వాదనకు బలం చేకూరినట్లైంది.
గందరగోళంలో బీఆర్ఎస్ ఇంచార్జ్ వర్గం..
మహిపాల్‌రెడ్డి కామెంట్స్‌తో ఆయన నిష్క్రమణ తర్వాత పార్టీ బాధ్యతలు స్వీకరించిన ఆదర్శ్ రెడ్డి వర్గం గందరగోళంలో పడింది. గూడెం కాంగ్రెస్‌లో చేరగానే పార్టీ బలహీనపడకుండా రంగంలోకి దిగిన మాజీ మంత్రి హరీశ్‌రావు శ్రేణులు జారిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఆదర్శ్ రెడ్డిని పార్టీ కో-ఆర్డినేటర్‌గా నియమిస్తూ ఆయనతో పాటు మరో ఎనిమిది మందికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి పార్టీ బాధ్యతలు వారే చూసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే వర్గం మళ్లీ పార్టీలో చేరుతున్నారని, పార్టీ టికెట్లు తమకే అని ప్రచారం చేసుకోవడంతో స్పందించిన ఆదర్శ్ రెడ్డి బీఫార్మ్‌లు ఎవరి జేబులో లేవని నియోజకవర్గంలో పార్టీని పర్యవేక్షిస్తున్న కమిటీతో పాటు అధిష్టానం చేతిలోనే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని ఇటీవలే మీడియాకు వివరించారు. అయితే తాజాగా గూడెం చేసిన వ్యాఖ్యలు ఆదర్శ్ రెడ్డి వర్గాన్ని ఆలోచనలో పడేశాయి. ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంటే ఎమ్మెల్యే పార్టీపై తనదే పెత్తనం అనేలా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం వద్దనే తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే తాజా కామెంట్స్ అటు అధికార పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. గూడెం కాంగ్రెస్‌పై వ్యాఖ్యలకు పరిమితమవుతారా? లేక తిరిగి సొంత గూటికి చేరుతారా? అంటే కొంత సమయం వేచిచూడాల్సిందే.






