- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ్ల కుప్పలు.. మృత్యు వారధులు
రోడ్ల పై ధాన్యాన్ని ఆరబెట్టడానికి పోస్తున్న ధాన్యపు రాసులు వాహన దారులకు మృత్యు వారధులుగా మారాయి. ప్రతి ఏటా వానకాలం పంట సీజన్ అయినా, యాసంగి పంట సీజన్ అయినా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పై పెద్ద మొత్తంలో ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలకు దారి తీస్తోంది.

దిశ, సిద్దిపేట ప్రతినిధి: రోడ్ల పై ధాన్యాన్ని ఆరబెట్టడానికి పోస్తున్న ధాన్యపు రాసులు వాహన దారులకు మృత్యు వారధులుగా మారాయి. ప్రతి ఏటా వానకాలం పంట సీజన్ అయినా, యాసంగి పంట సీజన్ అయినా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పై పెద్ద మొత్తంలో ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలకు దారి తీస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో స్థల లేమీ.. కొనుగోళ్లలో జాప్యం... అన్నదాతలకు అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం తదితర కారణాలు వెరసి ధాన్యం కుప్పల తో వాహన దారులు ప్రాణాలు గాలిలో దీపాల మాదిరి తయారైంది. కొన్ని సంఘటనల్లో వాహన దారులు ప్రాణాలు కోల్పోతుండగా, మరి కొన్ని సంఘటనల్లో తీవ్ర గాయాల పాలు అవుతున్నారు. కొండపాక మండలం మర్పడ్గ గ్రామానికి చెందిన తల్లి కొడుకు బైక్ పై వెళుతున్న క్రమంలో వడ్ల కుప్పల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుదర్శన్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, తల్లికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈనెల 21న కుకునూరు పల్లి మండ లం తిప్పారం గ్రామానికి చెందిన బుర్ర ప్రసాద్ గౌడ్ కారులో మండల కేంద్రానికి వెళుతున్న క్రమంలో రోడ్డుపై ఆర బోసన ధాన్యం పై కారు అదుపుతప్పి కంచె ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ గౌడ్ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గత వానకాలం సీజన్ లో చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో వాహనదారుడు మృత్యువాత పడ్డారు. ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్న సంఘటనలు వెలుగు చూడటం లేదు.
నలుపు రంగు టార్ఫాలిన్ కవర్లతో..
వడ్లపై నలుపు రంగు టార్ఫాలిన్ కవర్లు కప్పి ఉంచడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వడ్ల కుప్పలపై పెద్ద పెద్ద రాళ్లను ఏర్పాటు చేయడంతో అనుకోని ప్రమాదం జరిగే ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. దీనికి తోడు ధాన్యం శుభ్రపరచడం, కుప్పలు ఊడ్చడం లాంటివి కోర బండి ట్రాక్టర్లు వినియోగిస్తుండటం తో రహదారులు దెబ్బతింటున్నాయి. ఈ కారణాలతో ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
అవగాహన కల్పించడంలో విఫలం..
రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో ఈజీఎస్ ద్వారా కల్లాలను నిర్మించుకుంటే ప్రభుత్వం ద్వారా రూ.80 వేల వరకు ఆర్ధిక సాయం అందజేస్తుంది. పోలీసు, ఆర్ ఆండ్ బీ, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీసులు, పంచాయతీ అధికారులు కూడా కేవలం సూచనలకే పరిమితమవుతుండటంతోప్రతి ఏటా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని వసతులు కల్పించాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కలిగే ప్రమాదాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.






