ప్రభుత్వ ఉద్యోగి ఆడియో సోషల్ మీడియాలో దుమారం

by Ratna Kumari |

ఇటీవల జరిగిన దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయిపల్లి 1వ వార్డులో ఓటర్లతో ఫోన్‌లో అసభ్య పదజాలంతో సంభాషించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చెక్కర్లు కొడుతోంది.

ప్రభుత్వ ఉద్యోగి ఆడియో సోషల్ మీడియాలో దుమారం
X

దిశ, దుబ్బాక : ఇటీవల జరిగిన దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయిపల్లి 1వ వార్డులో ఓటర్లతో ఫోన్‌లో అసభ్య పదజాలంతో సంభాషించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చెక్కర్లు కొడుతోంది. ఈ వార్డు ఎస్సీ (మహిళ) రిజర్వేషన్ రావడంతో.. గతంలో అదే వార్డులో కౌన్సిలర్‌గా గెలిచిన తన సతీమణి స్థానంలో తన డ్రైవర్ అయిన సతీమణిని బరిలో దింపి ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి విశ్వప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ ఇప్పించడమే కాకుండా, ఎన్నికల ప్రచారంలో భాగంగా (బీఆర్ఎస్) పార్టీకి చెందిన ఓటర్లకు ఫోన్ చేసి, విచక్షణ రహితంగా దుర్భాషలాడుతూ, బెదిరింపుల ధోరణిలో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది. “పైసలు పోవట్టే… ఆరోగ్యం దెబ్బతినవట్టే… నేను హైదరాబాద్‌లో ఉంటా… చేత‌గాని వాళ్లు ఎందుకు ముందుకొచ్చారు” అంటూ ఓటర్లను కించపరిచేలా చేసిన మాటలు ఆడియోలో స్పష్టంగా వినబడుతున్నాయి.

ఇంతటితో ఆగకుండా హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ కార్యాలయంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి తన వార్డు మాత్రమే కాకుండా ఇతర వార్డుల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కూడా డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేయించాడని, అధికారాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తన సతీమణి కౌన్సిలర్‌గా గెలిచి పట్టు సాధించగా, ఈసారి రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో డ్రైవర్ సతీమణి రూపంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలుపు సాధించాలనే దుర్బుద్ధితో వ్యవహరించాడని స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై భారత ఎన్నికల సంఘం వెంటనే స్పందించి, ఆడియో నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఇలాంటి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి తీరని నష్టమని, ఎన్నికల స్వచ్ఛతపై తీవ్ర మచ్చగా నిలుస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఒకటవ వార్డులో ఓడిపోయిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాల్వ నరేష్ బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు సదరు ప్రభుత్వ ఉద్యోగిపై ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం.

Next Story