గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

by Taduka Kalyani |

గ్రామాలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి తెలిపారు.

గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
X

దిశ, వెల్దుర్తి : గ్రామాలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలలో కేవలం గ్రామ సభలకు పరిమితం అయ్యాయన్నారు. బుధవారం మాసాయిపేట మండల పరిధిలోని రామంతపూర్ తండాలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన ధాన్యమును అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రభుత్వం నిర్లక్ష్యం తో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతన్నలు పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతమని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ. 20 లక్షలు మంజూరు కావడం జరిగిందని త్వరితగతిన పనులు ప్రారంభించి భవన నిర్మాణం పూర్తి చేయాలని, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. రామంతపూర్ తండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి రామంతపూర్ తండా వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. తండాలో ఉన్న సమస్యలను సర్పంచ్ చందర్, ఉప సర్పంచ్ రాజు ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అలాగే గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఉచితంగా స్థలమును అందజేసిన ఉపసర్పంచ్ రాజును ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మోహన్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story