ధాన్యం కొనుగోళ్ల‌లో ప్ర‌భుత్వం ఫెయిల్

by Ratna Kumari |

వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ధాన్యం కొనుగోళ్ల‌లో ప్ర‌భుత్వం ఫెయిల్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు విషయం సీఎం రేవంత్ రెడ్డి కి పట్టదని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అవగాహన లేదని మండిపడ్డారు. సిద్దిపేట నియోజక వర్గం నారాయణ రావు పేట మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రంలోని సమస్యలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ కే హైమావతి తో ఫోన్ లైన్ లో మాట్లాడి ధాన్యం కొనుగోలు త్వరగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ... వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ వదిలి రైతుల కల్లాల వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆన్ లైన్ జీపీఎస్ విధానం అమలు చేయడంతో రోజుల తరబడి రైతులు ఎండలో కల్లాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. తరుగు పేరిట క్వింటాల్ కు 4-5 కిలోల తరుగు తీయడం దారుణమన్నారు. పాత విధానంలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పొద్దు తిరుగుడు, శనగ సంగం పంట మాత్రమే కొనుగోలు చేశారని, జొన్న పంట కొనుగోలుకు దిక్కే లేదన్నారు. 3-4 రోజుల్లో సమస్య పరిష్కరించని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారులు దిగ్బంధం చేసి కలెక్టరేట్ల వద్ద వంట వార్పు కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయాలని రైతులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story