ఇకపై డివిజన్ స్థాయిలోనే 'ప్రజావాణి'.. కలెక్టర్

by Kodari Anjali |

30 రోజుల డెడ్ లైన్.. ఆలస్యమైతే సమాధానం చెప్పాల్సిందేనని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై డివిజన్ స్థాయిలోనే ప్రజావాణి.. కలెక్టర్
X

దిశ, సంగారెడ్డి అర్బన్: “ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇక జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. మీ డివిజన్ కేంద్రంలోనే ప్రజావాణి” అంటూ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కీలక ప్రకటన చేశారు. నేటి నుంచి జిల్లాలో ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎక్కడెక్కడ ప్రజావాణి?

సోమవారం కలెక్టరేట్‌ గ్రీవెన్స్ హాల్‌లో ప్రజావాణి నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ప్రజావాణితో పాటు సంగారెడ్డి, ఆందోల్ డివిజన్ల ప్రజావాణినిర్వహిస్తామన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్ కేంద్రాల్లోని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం డివిజన్ స్థాయి ప్రజావాణి జరుగుతుందని స్పష్టం చేశారు.ఆయా మండలాల ప్రజలు తమ డివిజన్ కేంద్రంలో జరిగే ప్రజావాణికి హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలి. జిల్లా కేంద్రానికి రావాల్సిన శ్రమ, ఖర్చు తగ్గుతుంది అని కలెక్టర్ సూచించారు.

30 రోజులే డెడ్‌లైన్...

డివిజనల్ స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా ప్రజావాణికి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి 30 రోజుల్లోపు పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో ఆలస్యమైతే దానికి గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని, జాప్యం చేయొద్దని హెచ్చరించారు.

తొలిరోజు 134 ఫిర్యాదులు..

జిల్లావ్యాప్తంగా డివిజన్ల వారీగా నిర్వహించిన తొలి ప్రజావాణిలో మొత్తం 134 ఫిర్యాదులు అందాయి. కలెక్టరేట్‌కు 57, సంగారెడ్డి డివిజన్‌కు 29, ఆందోల్‌కు 02, నారాయణఖేడ్‌కు 24, జహీరాబాద్‌కు 22 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ స్వయంగా అర్జీదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని, సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, సంగారెడ్డి, ఆందోల్ డివిజన్ అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Next Story