- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలకు స్తంభించిన మెతుకు సీమ.. రెడ్ జోన్‌లో 5మండలాలు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు!?
మెదక్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో అపార నష్టం వాటిల్లింది.

దిశ, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల మూలంగా జిల్లాలో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా వేలాది ఎకరాల్లో పంట నష్టం, పలు గ్రామాలకు వెళ్లే దారులు ధ్వంసమయ్యాయి. సబ్ స్టేషన్ నీట మునిగి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా బంద్.. ఇళ్లు కూలి ఎంతో మంది వర్షం నిరాశ్రయులను చేసింది. జిల్లాలో జరిగిన నష్టాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు జిల్లా మంత్రులు సైతం వచ్చి పరిశీలించారు.
మెదక్ జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షం తో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గతంలో లేని విధంగా 300 మీమీ వర్షపాతం నమోదు కావడం వర్ష తీవ్రతను సూచిస్తుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. జిల్లా వ్యాప్తంగా పీ ఆర్ రోడ్ల 45 ఉండగా 65 చోట్ల డ్యామేజ్ అయినట్లు అధికారులు గుర్తించారు. రోడ్డు మరమ్మత్తుల కోసం 3.99 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో బారీ స్థాయిలో రైతులు పంటలు సాగు చేశారు. కానీ భారీగా కురిసిన వర్షాలకు 6341 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 2632 చెరువు పూర్తి స్థాయిలో నీరు వచ్చింది. ఇందుకు 26 చెరువులు కట్టలు తెంచుకోగా 40 చెరువులకు సాధారణ డ్యామేజ్ జరిగింది.
అన్ని చెరువులు మరమ్మత్తులు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. వర్షాల మూలంగా ప్రజల జీవనం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాలు జలదిగ్బంధం నుంచి బయటకు రాలేదు. వరద ఉధృతి మూలంగా వేరే ప్రాణాలకు వెళ్లలేని విధంగా మారింది. మెదక్ పట్టణంలోని పుల్లికొట్టాల్ సబ్ స్టేషన్ లోకి నీళ్లు రావడం మూలంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని గ్రామాల్లో ఇంకా విద్యుత్ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. హవేలీ ఘనపూర్ మండలం లోని పలు గ్రామాల్లో విద్యుత్ మరమ్మత్తు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు ఇంకా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చాలా గ్రామాల్లో నివాస గృహాలు నీట మునగగా కొన్ని గ్రామాల్లోని ఇళ్లు వర్షానికి కూలాయి.
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
ఏరియల్ సర్వేకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మెదక్‌కు వచ్చారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి హెలిపాడ్ లో వచ్చిన సీఎం మెదక్ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా అధికారులతో పాటు మెదక్ ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు లు సైతం ఉన్నారు. జిల్లాలో జరిగిన నష్టం పై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సీఎంకు వివరించారు. ఇద్దరు మృతి పై విచారం వ్యక్తం చేసిన సీఎం ఆర్థిక సహాయం కు ఆదేశించారు. జిల్లాలో ఎంత నష్టం వచ్చింది.. అనే దానిపై పూర్తిగా నివేదిక సిద్ధం చేసి మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు తక్షణ సేవలు అందించేలా ఉండాలని చెప్పారు. జిల్లాలో జరిగిన నష్టంపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఎంపీ పర్యటన…
మెదక్ జిల్లాలో వరద బీభత్సం నేపథ్యంలో జిల్లా ఇంఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పరిశీలించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులు మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించి వాడి, బూరుగుపల్లి, సర్దన గ్రామాల్లో వర్షం వల్ల నష్టం కలిగిన ప్రాంతాలను పరిశీలించారు. సీఎం జిల్లాకు కోటి ప్రకటించిన విషయాన్ని వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయం చేయాలని సాధించారు. రామాయంపేట లో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించి పరిశీలించారు.
ఎంపీ రఘునందన్ రావు సైతం పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. మాజీ మంత్రి హరీష్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు సైతం పరిశీలించారు. వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. సకాలంలో స్పందించి ఉంటే ఇద్దరు ప్రాణాలతో బయటపడేవకరని ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇకనైనా జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రెడ్ జోన్ లో ఐదు మండలాలు!
జిల్లాలో కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం ఉదయం వరకు వాతావరణ శాఖ ప్రకటించిన వర్షపాతం రిపోర్టు లో మెదక్ జిల్లాలోని 5 మండలాలు ఇంకా రెడ్ జోన్ లోనే ఉన్నాయి. సర్దన లో అత్యధికంగా 316 మీ మీ నమోదైంది. అలాగే నర్సాపూర్ లో 278, చేగుంట 232, రామాయంపేట 208, మెదక్ 207 మిమీ వర్షపాతం నమోదు అయింది. ఆరెంజ్ జోన్ లో రాజుపల్లి, కొల్చారం, దామరంచ, శివునూరు, నార్లపూర్, ఇస్లాంపూర్, పెద్ద శంకరం పేట, టెక్మాల్ లలో అత్యధిక వర్షపాతం నమోదైంది.






