- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేక్ సర్టిఫికేట్లతో బ్రతికుండగానే రైతు భీమా.. చర్యలు శూన్యం
రైతు బతికున్నా చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసి రూ.5 లక్షల చొప్పున రైతుబీమా పరిహారం కాజేసిన వైనం మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

దిశ, మెదక్ ప్రతినిధి: రైతు బతికున్నా చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసి రూ.5 లక్షల చొప్పున రైతుబీమా పరిహారం కాజేసిన వైనం మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధుల ప్రమేయంతో పాటు కార్యదర్శుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బీమా స్వాహాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సంబంధిత శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయకపోవడం, చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మెదక్ మండలం గుట్టకింది పల్లిలో శ్రీనివాస్, మల్లేష్ లు బతికి ఉండగానే గ్రామ పంచాయతీ కార్యదర్శులు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. దీంతో అక్రమంగా రైతు బీమా పొంది ప్రభుత్వాన్ని మోసం చేసిన వైనం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో ఒక కార్యదర్శి మృతి చెందగా మరో కార్యదర్శి ఉన్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే బూరుగుపల్లిలో కూడా లెంక మల్లేశం బతుకు దెరువు కోసం వలస వెళ్లాడు. అతని భార్య స్థానిక ఓ ప్రజా ప్రతినిధి సహకారంతో గ్రామ కార్యదర్శితో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకొని డెత్ సర్టిఫికెట్ పొంది రైతు బీమా సొమ్ము స్వాహా చేసిన సంగతి తెలిసిందే. ఈ మోసం 2021, 2023లో జరగగా, 2024 డిసెంబర్ లో వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని విజయలక్ష్మిని విచారణ అధికారిగా నియమించారు. రెండు గ్రామాల్లో విచారణ జరిపిన అధికారి జిల్లా కలెక్టర్ కు సమగ్ర విచారణ నివేదికను అందజేశారు. కానీ ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నాటిన మొక్కలు ఎండితేనే సస్పెన్షన్ చేసే అధికారులు బతికి ఉన్న వారికి సచ్చినట్టుగా డెత్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వ సొమ్ము కాజేయడంతో సహకరించిన వారిపై చర్యలు విషయంలో అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థకాని ప్రశ్న. తప్పుడు డెత్ సర్టిఫికెట్ మంజూరు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు విధుల్లోకి రాలేదు. అందుబాటులో లేని కారణంగా ఎలాంటి నోటీసుకు ఇవ్వలేని సంబధిత అధికారులు చెబుతున్నారు.
విచారణ పూర్తి చర్యల్లో అలసత్వం..?
గుట్టకిందిపల్లి, బూరుగుపల్లిలలో తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలు గ్రామ పంచాయతీలో తీసుకొని రైతు బీమా కాజేసిన ఉదంతం వెలుగులోకి రావడం తో జిల్లా కలెక్టర్ స్పందించి ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని విజయలక్ష్మి ని విచారణ అధికారిగా నియమించారు. రెండు గ్రామాల్లో విచారణ చేపట్టిన అధికారి జరిగిన విషయంపై సమగ్ర విచారణ జరిపి జిల్లా కలెక్టర్ కు రిపోర్టు అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపి నివేదిక అందజేశానని, చర్యలపై నిర్ణయం కలెక్టర్ కు ఉంటుందని తెలిపారు.
చర్యల కోసం కలెక్టర్ కు రిపోర్టు పెట్టాం.. యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి
గుట్టకింది పల్లి, బూరుగు పల్లి లో గ్రామ పంచాయతీ కార్యదర్శులపై జిల్లా కలెక్టర్ కు క్రమ శిక్షణ చర్యలు తీసుకునేందుకు రిపోర్టు పెట్టమని చెప్పారు. ఈ ఫైల్ ద్వారా పంపాలని చెప్పడం తో ఈ ఫైల్ సిద్ధం చేసి పంపిస్తామని తెలిపారు. ఘటన వెలుగులోకి వచ్చిన తరవాత పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం మూలంగా షోకాజ్ ఇవ్వడం వీలు కాలేదన్నారు. పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు జరగడం మూలంగా కోర్టులో కేసు ఉన్నందున చర్యల విషయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి వివరణ ఇచ్చారు.






