Luxury Life : పల్లెల్లోనూ డూప్లెక్స్‌ భవంతులు.. లగ్జరీ లైఫ్‌‌పై కోరుకుంటున్న జనం

by Javid Pasha |

గ్రామీణ ప్రజలు సైతం విలాసంవంతమైన లైఫ్ స్టైల్ కల్చర్ కు అలవాటు పడుతున్నారు. పెద్ద పెద్ద డూప్లెక్స్ లు భవనాలు కట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Luxury Life : పల్లెల్లోనూ డూప్లెక్స్‌ భవంతులు.. లగ్జరీ లైఫ్‌‌పై కోరుకుంటున్న జనం
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ఒకప్పుడు పల్లెల్లో ఇండ్లంటే పెంకుటిళ్లే గుర్తుకు వస్తాయి. కట్టెల పొయ్యి మీద వంటకాలు.. ఇంటి ముంగిట కల్లాపి చల్లడాలు.. పెంకుటిల్లు ముంగట పెద్ద అరుగులు.. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే దృశ్యాలు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు సైతం విలాసంవంతమైన లైఫ్ స్టైల్ కల్చర్ కు అలవాటు పడుతున్నారు. ఖర్చుకు అస్సలు తగ్గకుండా మంచి ఇంటీరియర్ తో కూడిన పెద్ద పెద్ద డూప్లెక్స్ లు, బహుళ అంతస్తుల భవనాలు కట్టుకొని ఉమ్మడి కుటుంబమంతా కలిసి అందులో ఉంటున్నారు. వ్యాపారం ఇతర ఉద్యోగాల నిమిత్తం సిటీకి వెళ్లి వచ్చే కొంత మంది గ్రామీణ ప్రజలు ఉన్న సొంత ఊరిని విడిచిపెట్టి వేరే చోట ఉండడం ఇష్టం లేక ఉన్న ఊర్లోనే విలాసవంతమైన బిల్డింగులు నిర్మించుకొని సంతోషంగా ఉంటున్నారు.

గ్రామాల్లో సిటీ కల్చర్

సంగారెడ్డి జిల్లా చుట్టుపక్కన గ్రామాల్లో నివసించే ప్రజలు సిటీ కల్చర్ కు కొద్దికొద్దిగా అలవాటు పడుతున్నారు. అందుకు తగ్గట్టే ఖర్చు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ కు దగ్గరగా ఉండే సంగారెడ్డి జిల్లా కేంద్ర పరిధి గ్రామాల్లో డూప్లెక్స్ బిల్డింగ్ లు ఇప్పుడు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. పోతిరెడ్డిపల్లి, కంది, మల్కాపూర్, పెద్దాపూర్, నందికంది, సదాశివపేట, లక్దారం, రుద్రారం, ఇస్నాపూర్, చిట్కుల్, హత్నూర, కొండాపూర్, రాయికోడ్, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి ప్రాంతాల్లో డూప్లెక్స్ బిల్డింగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఎక్కువగా సంగారెడ్డి పట్టణంతో పాటు పోతిరెడ్డిపల్లి, కంది, పటాన్ చెరు ఏరియా పరిధిలోని గ్రామాల్లో ప్రతి వీధిలో కనీసంగా నాలుగు డూప్లెక్స్ బిల్డింగ్ లు దర్శనమిస్తున్నాయి.

ఒకే చోట ఉమ్మడి కుటుంబం

గ్రామంలో నివసించే వారు చాలా మంది ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగానే కలిసి ఉంటున్నారు. ఇంట్లో ప్రతి ఒక్కరూ మంచిగా సంపాదిస్తున్న క్రమంలో సకల సౌకర్యాలతో కూడిన మంచి డూప్లెక్స్ బిల్డింగును వారి టేస్ట్ కు తగ్గట్టుగా కట్టుకుంటున్నారు. అలా కట్టుకున్న డూప్లెక్స్ బిల్డింగ్ లోనే ఉమ్మడి కుటుంబం అంతా కలిసి ఉండేందుకు మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు మరికొందరు వారి స్తోమత మేరకు డూప్లెక్స్ తరహాలోనే పెద్ద పెద్ద బహుళ అంతస్తులతో కూడిన ఇంటిని నిర్మించుకొని ఆ ఇంటిలోనే విలాసవంతమైన ఫర్నీచర్ ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని తమ సుఖవంతమైన జీవనం కొనసాగిస్తున్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి ఊరిలో డూప్లెక్స్ బిల్డింగులు దర్శనం ఇస్తాయనే మాటలో ఎలాంటి సందేహం లేదు.

Next Story