హుస్నాబాద్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

by Ratna Kumari |

హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠగా సాగింది.

హుస్నాబాద్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
X

దిశ, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పర్యవేక్షణలో నిర్వహించిన ఓటింగ్ ద్వారా ముగ్గురు సభ్యులను ఎన్నుకున్నారు. జనరల్ కేటగిరీలో పున్న లావణ్య, భూక్యా సరోజన ఎన్నికవ్వగా, మైనార్టీ విభాగం నుంచి మహమ్మద్ హసన్ లాల్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో కమిషనర్ మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేయించారు. నాలుగో కో-ఆప్షన్ స్థానానికి సంబంధించి కౌన్సిలర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో, ఏకాభిప్రాయం సాధించే వరకు ఆ ఒక్క స్థానాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి: మంత్రి

నూతనంగా ఎన్నికైన సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. "కొత్తగా ఎన్నికైన సభ్యులు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ, మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలి. పట్టణంలోని అన్ని వార్డుల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలి. ప్రస్తుత ఇళ్లు పూర్తయితేనే కొత్తగా మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయి" అని ఆయన స్పష్టం చేశారు. అందరూ ఒకే గొంతుకగా మారి పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించిన 20 మంది వార్డు కౌన్సిలర్లకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story