జహీరాబాద్ కు పచ్చని కిరీటం.. జూన్ లో అందుబాటులోకి ఏకో పార్క్

by Ajay Maddhiboyina |

కాంక్రీట్ వనాల మధ్య నలిగిపోతున్న మానవాళికి ప్రకృతి ఒడిలో సేదతీరే అద్భుత అవకాశం త్వరలోనే లభించనుంది. మానవ ప్రమేయం వల్ల ప్రకృతి దెబ్బతినకుండా చూస్తూనే, ప్రకృతి తో మమేకమై సమయం గడపడానికి, అన్ని వయసుల వారికి మానసిక ఉల్లాసాన్ని, ఆయుష్షును పెంచేందుకు

జహీరాబాద్ కు పచ్చని కిరీటం.. జూన్ లో అందుబాటులోకి ఏకో పార్క్
X

దిశ, జహీరాబాద్: కాంక్రీట్ వనాల మధ్య నలిగిపోతున్న మానవాళికి ప్రకృతి ఒడిలో సేదతీరే అద్భుత అవకాశం త్వరలోనే లభించనుంది. మానవ ప్రమేయం వల్ల ప్రకృతి దెబ్బతినకుండా చూస్తూనే, ప్రకృతి తో మమేకమై సమయం గడపడానికి, అన్ని వయసుల వారికి మానసిక ఉల్లాసాన్ని, ఆయుష్షును పెంచేందుకు జహీరాబా ద్‌లో ఒక అద్భుతమైన ప్రదేశం సిద్ధమవుతోంది. అదే ఏకో పార్క్. జహీరాబాద్ మున్సిపాలిటీ వాసులతో పాటు పర్యాటకులు, సందర్శకులకు అడవి అందాలతో ఆహ్లాదాన్ని పంచేందుకు జూన్ నెలలో ఈ పార్కును ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర..

సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి 65పై దాదాపు 8 సంవత్సరాల కిందట ఈ ఏకో పార్క్ (అర్బన్ పార్క్) పనులకు పురుడుపోసుకుంది. జహీరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 200 ఎకరాల భారీ విస్తీర్ణంలో దీనిని లంగ్ స్పేస్ (పచ్చని ఊపిరితిత్తులు)గా మార్చాలని సంకల్పించారు. పార్క్ అభివృద్ధి కోసం ప్రభుత్వం హరిత నిధి కింద రూ.4 కోట్లు మంజూరు చేసినప్పటికీ.. మొదట్లో కేవలం రూ.2 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో నిధుల లేమి కారణంగా పనులు మధ్యలోనే నిలిచిపోయి, స్థానికులకు ఆహ్లాదాన్ని పంచాలన్న లక్ష్యం కాస్త నీరుగారిపోయింది.

అయితే, ఇటీవల అటవీశాఖ మంత్రి కొండ సురేఖ ప్రత్యేక ఆదేశాలతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ కదలిక వచ్చింది. కాంపెన్సేటరీ అఫ్ఫారెస్ట్రేషన్ (సీఏఎంపీఏ) నిధుల నుంచి రూ.55లక్షలు కేటాయించడంతో పెండిం గ్ పనులు శరవేగంగా పుంజుకున్నాయి. జూన్ కల్లా పనులన్నీ పూర్తి చేసి, ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

ప్లాస్టిక్ కాంక్రీట్ కు నో..

అంతా సహజసిద్ధం

సాధారణ పార్కులకు, ఈ ఎకో పార్కుకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ కాంక్రీట్ కట్టడాలు చాలా తక్కువ. పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి నిర్మాణాన్నీ సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాయితో చేసిన రచ్చబండలు, సెక్యూరిటీ రూమ్స్, వాకింగ్ ట్రాక్ పొడవునా సేద తీరేందుకు లాంగ్ బెంచీలు, గజబోలను నిర్మించారు.

పట్టణ ప్రజల హెల్త్ హబ్

నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించే పచ్చటి ఊపిరితిత్తులుగా ఈ ఎకో పార్క్ సేవలు అందించనుంది. ఉదయం పూట వాకింగ్ చేసేవారి కోసం ప్రశాంతమైన నడక దారులు, మానసిక ప్రశాంతత కోసం ప్రత్యేకంగా యోగా కేంద్రం, పిల్లలు కేరింతలు కొట్టేందుకు ప్లే ఏరియా, ఇక్కడ సిద్ధమయ్యాయి. దీంతోపా టు, నేటి తరం విద్యార్థులకు, యువతకు ప్రకృతిని ఎలా ప్రేమించాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి? అనే విషయాలపై అవగాహన కల్పించడానికి పార్క్ అంతటా ప్రత్యేక ప్రదర్శనలు, సైన్ బోర్డుల ను ఏర్పాటు చేస్తున్నారు. పక్షుల కిలకిల రాగాల మధ్య, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ గడిపే సమయం.. పట్టణ ప్రజల మానసిక ఒత్తిడిని దూరం చేసి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని జహీరాబాద్ అటవీ రేంజ్ అధికారి (ఎఫ్ఆర్ఓ) శ్యామ్ సుందర్ రావు చెప్పారు. జూన్ నెలలో ప్రారంభం కానున్న ఈ ప్రకృతి వనం కోసం జహీరాబాద్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు.

పక్షుల కిలకిల రాగాలు..

ఔషధ వనాల సువాసనలు..

వర్షపు నీటినిల్వ, సౌరశక్తి వినియోగం, సేంద్రీయ వ్యర్థాల ఎరువుల వినియోగంతో పర్యావరణ అనుకూలమైన 200 ఎకరాల అభయారణ్యంలో అరుదైన వృక్ష సంపద కొలువై ఉంది. శ్రీగంధం, మర్రి, రావి, ఉసిరి, చింత, బాంబో (వెదురు), నెమిలినారా, తెల్లమద్ది, సీతాఫలం, వేప, రేగు, కాషు, రేలా, తునికి, ఠాణి వంటి ఎన్నో రకాల చెట్లు, పక్షులు, రంగురంగుల సీతాకోకచిలుకలకు ఈ పార్క్ ఆశ్ర యంగా మారింది.

నిధుల వినియోగమిలా..

గతంలో విడుదలైన రూ. 2 కోట్ల నిధులతో కీలకమైన మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుత అదనపు నిధులతో పనులన్నీ తుది దశకు చేరాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..వాకింగ్ ట్రాక్ కోసం (మొరం రోడ్డు)రూ. 22 లక్షలతో నిర్మించగా వాచ్ టవర్ (అడవి అందాల వీక్షణకు) రూ.15 లక్షలు ఖర్చుచేశారు. ఐరన్ ఫెన్సింగ్ (3 కి.మీ మేర ఇనుప కంచె)రూ. 90 లక్షలు, ప్రధాన ద్వారం , వాచ్ మెన్ రూమ్ రూ. 6.7 లక్షలు వెచ్చించగా.. ప్రస్తుతం రూ. 6.70 లక్షలు ఖర్చు చేసి రాయితో నిర్మించిన సెక్యూరిటీ రూమ్, రూ. 9.24 లక్షల యోగా షెడ్, రూ. 3.50 లక్షల సోలార్ బోర్వెల్, రూ.14 లక్షల పిల్లల ఆట స్థలం(చిల్డ్రన్ ప్లే ఏరియా), వాకింగ్ ట్రాకు ఇరువైపులా 40 వరకు లాంగ్ స్టోన్ బెంచీలు, 20వరకు తడి, పొడి చెత్త కోసం వేర్వేరు డస్ట్ బిన్ లను ఏర్పాటు చేశారు. రూ.2లక్షల 4 రచ్చ బండ ప్లాట్ ఫాంల నిర్మాణాలు పూర్తి చేశారు. రూ.9.90 లక్షలు వెచ్చించి చేపట్టి న మరుగుదొడ్లు, అంతర్గత లింకు రోడ్లు తదితర మిగతా పనులు త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.

Next Story