డ్రగ్స్ అలవాటు మెదడు సంకేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది

by Taduka Kalyani |

మాదకద్రవ్యాల అలవాటు మెదడు సంకేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని మెదక్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి పేర్కొన్నారు.

డ్రగ్స్ అలవాటు మెదడు సంకేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది
X

దిశ, నర్సాపూర్ : మాదకద్రవ్యాల అలవాటు మెదడు సంకేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని మెదక్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నర్సాపూర్‌ పట్టణ సమీపంలోని బీవీఆర్ఐటి కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో "డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సు" విజయవంతంగా నిర్వహించారు. యువతను వేధిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారి పై అవగాహన కల్పించేందుకు నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మెదక్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్, మరియు ఇన్‌స్పెక్టర్ గులాం ముస్తఫా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ... "డ్రగ్స్‌కు నో (NO) చెప్పండి" అని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వల్ల మెదడులో కలిగే 'డోపమైన్' ప్రభావం గురించి వారు వివరించారు. ఈ అలవాట్లు మెదడు సంకేత వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తాయో, తద్వారా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, కెరీర్ మరియు ఆరోగ్యం ఎలా నాశనమవుతాయో హెచ్చరించారు. ఇదే క్రమంలో ఎస్.ఐ (SI) సుచరిత కూడా విద్యార్థులకు ప్రత్యేక సందేశాన్నిస్తూ, డ్రగ్స్‌కు ఖచ్చితంగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇతర ఉన్నతాధికారులు సీఐ రాఘవేంద్రరావు, ఎస్.ఐ అజీజ్ ఖాన్, ఎస్.ఐ అరుణ, డి.టి.ఎఫ్ సీఐ గోపాల్, మరియు డి.టి.ఎఫ్ ఎస్.ఐ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. BVRIT డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్ దూబే కూడా ఈ సదస్సులో పాల్గొని, విద్యార్థులు తోటివారి ఒత్తిళ్లకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్తు కోసం చదువుపైనే దృష్టి పెట్టాలని సూచించారు.

Next Story