డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్సు స్టాఫ్ ఏర్పాటు చేయాలి: పీడీఎస్‌యూ ధర్నా

by Kodari Anjali |

ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థుల సౌకర్యార్థం తక్షణమే శాశ్వత బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు.

డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్సు స్టాఫ్ ఏర్పాటు చేయాలి: పీడీఎస్‌యూ ధర్నా
X

దిశ, ఇల్లెందు: ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థుల సౌకర్యార్థం తక్షణమే శాశ్వత బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇల్లందు బస్సు డిపో ఎదుట పీడీఎస్‌యూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో రవాణా శాఖ ట్రాఫిక్ ఇన్‌చార్జి సునీతకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నాయకులు గంగాధర్, గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బస్సు నిలయం లేకపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కిలోమీటరు వరకు నడవాల్సిన పరిస్థితి..

ఇల్లందు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను కరెంట్ కార్యాలయం వద్ద, టేకులపల్లి వైపు నుంచి వచ్చే వారిని సుదిమళ్ల బస్సు నిలయం వద్ద దింపివేస్తుండటంతో కళాశాలకు చేరుకోవడానికి సుమారు 45 నిమిషాల పాటు నడవాల్సి వస్తోందని తెలిపారు. దీని వల్ల విద్యార్థులు తరగతులకు సమయానికి చేరుకోలేకపోతున్నారని, ప్రతిరోజూ 800 మీటర్ల నుంచి కిలోమీటరు వరకు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కళాశాల అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేవలం అభ్యర్థన మేరకు మాత్రమే బస్సులు ఆపే విధానం సరిపోదని, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా శాశ్వత బస్సు నిలయం, బస్సు షెల్టర్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్, లక్ష్మీనరసింహ, అఖిల్, రాంచరణ్, హేమచంద్ర, హిమబిందు, అక్షయ, మీనా, శాంతి, రష్మిక, నందిని, లలిత, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

Next Story