వికసిత్ భారత్ అంటే ప్రజలపై భారం మోపడమా..?

by Taduka Kalyani |

ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ పేరిట ప్రగల్భాలు పలుకుతున్నాడని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

వికసిత్ భారత్ అంటే ప్రజలపై భారం మోపడమా..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ పేరిట ప్రగల్భాలు పలుకుతున్నాడని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. బడా పారిశ్రామిక వేత్తలకు దేశ సంపదను కట్టబెడుతూ.. పేద మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమేనా వికసిత్ భారత్ అని సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శక్తి గార్డెన్ లో ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్రం రాక ముందే కార్మికుల హక్కుల సాధననే ధ్యేయంగా ఏఐటీయూసీ పురుడు పోసుకుందన్నారు. కార్మిక పక్షపాత, కార్మికుల మొదటి సంఘం, ఆశ దీప సంఘం ఏఐటీయూసీ అన్నారు. కార్మికుల హక్కులతో పాటుగా, దేశ స్వాతంత్రం, తెలంగాణ సాయుధ పోరాటంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించింది అన్నారు. ప్రధాని మోడీ రైతు కార్మిక వ్యతిరేకి అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రధాని మోడీ కాల రాశారని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో నిత్య అవసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్య తరగతి ప్రజలపై భారం పడిందన్నారు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్ డీ ఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రజల పై ముప్పేట దాడి జరుగుతుందన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం పూర్తిగా అమలు కావడం లేదన్నారు. అమర వీరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై సీపీఎం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కనుకుంట్ల శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేషం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లక్ష్మన్, అధ్యక్షుడు ఆది రంగారెడ్డి, నాయకులు ఆశోక్, మల్లేషం, చంద్రం, బిక్షపతి, ఐలయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story