జీవో నెం.58,59 కింద 1,304 పట్టాల పంపిణీ: ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు

by Disha Web Desk 1 |
జీవో నెం.58,59 కింద 1,304 పట్టాల పంపిణీ: ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు
X

రాష్ట్రంలో నూతనంగా 12 మెడికల్ కాలేజీల ఏర్పాటు

దిశ, సంగారెడ్డి : ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి జీవో.నెం.58, 59 కింద ఇంటి పట్టాలు అందిస్తున్నామని, జిల్లాలో 1,304 మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పలు అభివద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. కలెక్టరేట్ కు పర్యావరణ పరిరక్షణ, గుడ్ అడ్మినిస్ట్రేషన్ కు ఐ.ఎస్.వో 14001, ఐ.ఎస్.వో 9001 అవార్డులను కలెక్టర్ శరత్ కు అందజేశారు.

కలెక్టరేట్ ఉద్యోగులను అభినందించారు. అనంతరం ఆడిటోరియంలో జీవో.నెం.59 లబ్ధిదారులకు పట్టా సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ చేసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును తీసుకుని వారికి పట్టాలు అందిస్తున్నామన్నారు. ధరణితో భూముల క్రయవిక్రయాలు సులభతరం అయ్యాయన్నారు. భూముల సమస్యలు లేకుండా ధరణీ ద్వారా పరిష్కరించామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. కానీ కొందరూ ధరణీని రద్దు చేస్తామని ప్రకటిస్తున్నారని, ధరణీ రద్దు చేయడం అంటే తిరిగి భూస్వామ్య పద్ధతి, ఆక్రమణలను ప్రోత్సహించడమేనన్నారు.

క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం

సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్, రేడియాలజీ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 83శాతం ప్రసవాలు జరిపి దేశంలోనే నెంబర్ వన్ గా జిల్లాగా సంగారెడ్డి నిలిచిందని కొనియాడారు. 90 శాతం ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెల నుంచి న్యూట్రిషన్ డే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉన్న గర్భిణులకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు న్యూట్రీషన్ కిట్లను అందజేస్తామన్నారు. ఏప్రిల్ నెల నుంచి దీనిని ప్రారంభిస్తున్నామని తెలిపారు.

ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

మెడికల్ కాలేజీలో విద్యార్థులు ర్యాంగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. మెడికల్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించిన మంత్రి మెడికల్ కాలేజీలో ఉన్న వసతులు, ఇబ్బందులపై విద్యార్థులతో చర్చించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 1956 నుంచి 2014 వరకు రాష్ట్రంలో కేవలం మూడు మెడికల్ కాలేజీలను మత్రమే ఏర్పాటు చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని వివరించారు.

మెడికల్ కాలేజీలలో దేశంలో ఎక్కడా లేని విధంగా సీట్లను కేటాయిస్తున్నామన్నారు. రూ.142 కోట్లతో మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని, కానీ కాలేజీల్లో విద్యార్థులు ఎలాంటి ర్యాగింగ్ లకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎవ్వరైనా ర్యాంగింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సంగారెడ్డిలోని తారా కళాశాల అదనపు గదులను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పాత డీఆర్డీఏ కార్యాలయం ప్రాంగణంలో గ్రామ సమైఖ్య సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు.

అక్కడే టీఎన్జీవోల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన, బైపాస్ రోడ్డు నుంచి ఓ ప్రైవేట్ ఆసుప్రతి మల్కాపూర్ చౌరస్తా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు జిల్లా ఆసుపత్రిలో పోలీసులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజర్షీ షా, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ, వైస్ చైర్ పర్సన్ లతా విజయేందర్ రెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ వాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్, సంగారెడ్డి ఆర్డీవో నగేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed