- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువుల కబ్జాను అరికట్టేందుకు డిజిటల్ సర్వే
చిన్న నీటి వనరులను సంరక్షించేందుకు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన డిజిటల్ కమిటీల ద్వారా చెరువుల పై సర్వే నిర్వహించి ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్ణయిస్తున్నారు.

దిశ, చిన్నశంకరంపేట : చిన్న నీటి వనరులను సంరక్షించేందుకు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన డిజిటల్ కమిటీల ద్వారా చెరువుల పై సర్వే నిర్వహించి ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్ణయిస్తున్నారు. చిన్నశంకరంపేట మండలంలో మొత్తం 173 చెరువులు, కుంటలు ఉండగా, మొదటి దశలో 30 చెరువులకు ఎఫ్‌టీఎల్ సర్వే చేయడానికి అనుమతులు లభించాయి. చెరువుల సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నీటి మట్టాన్ని గుర్తించి, ఖచ్చితమైన హద్దులను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. డిజిటల్ సర్వే కోసం ఇప్పటికే చెరువుల వద్ద ప్రత్యక్షంగా పరిశీలనలు ప్రారంభించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చెరువులను అక్రమంగా కబ్జా చేసి, ముందుగా మట్టి నింపి తర్వాత భవనాలు నిర్మిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చేగుంట వంటి పట్టణాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం డిజిటల్ సర్వే చేపట్టింది.
చెరువులకు పక్కా హద్దులు..
మొదటి దశలో గుర్తించిన 66 చెరువులకు డిజిటల్ సర్వే నిర్వహించేందుకు అధికారులతో కూడిన కమిటీలను నియమించారు. ఈ కమిటీల్లో తహసీల్దార్, రెవెన్యూ సర్వేయర్, ఇరిగేషన్ ఏఈ, అటవీ శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న చెరువుల పటాలు, గూగుల్ మ్యాప్ ఆధారంగా సర్వే నిర్వహించి, ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్ణయిస్తున్నారు. అవసరమైతే శాశ్వతంగా చెరిగిపోని విధంగా గుర్తులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
కబ్జాలు అరికట్టేందుకే ఎఫ్‌టీఎల్ సర్వే
మెదక్ జిల్లాలో చిన్న నీటి వనరులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. కమిటీల ద్వారా సర్వే నిర్వహించి ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్ణయించడం వల్ల చెరువులు కబ్జాలకు గురికాకుండా అరికట్టవచ్చని చెప్పారు. వర్షాకాలానికి ముందు మొదటి దశలో 606 చెరువుల ఎఫ్‌టీఎల్ హద్దులను గుర్తించి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే మండలంలోని చెరువుల వద్ద సర్వే పనులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.






