దశాబ్ధి ఉత్సవాలు.. ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
దశాబ్ధి ఉత్సవాలు.. ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు : మంత్రి హరీష్ రావు
X

ఉద్యమంలో ఆ రెండు పార్టీలు కలిసి రాలేదు

తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎంతో ప్రగతి

తెలంగాణ దేశంలో దూసుకుపోతోంది

దిశ, మెదక్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు జరిపితే.. ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా కలెక్టరెట్ లో దశాబ్ధి ఉత్సవాలపై ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగనున్నాయని ఆయన తెలిపారు.

ఇందుకు అమరుల త్యాగాలను, తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని స్మరించుపోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అవతరణ జూన్ 2 మనకు స్వాతంత్య్ర దినం లాంటిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పది జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అవతరణ తరవాత తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అద్భుత పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు.

ఇంత అభివృద్ధి జరిగిన నేపథ్యంలో ప్రగతిపై రాష్ట్రంలో దశాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబితే కాంగ్రెస్, బీజేపీలకు మింగుడుపడటం లేదంటూ ఆరోపించారు. ఉద్యమంలో నాడు ఆ రెండు పార్టీలు కలిసి రాలేదన్నారు. అందుకే నేడు ఉత్సవాలకు రావడం లేదన్నారు. ఉత్సవాలు వద్దు అన్నారంటే.. అమరుల త్యాగాలను కాంగ్రెస్ తక్కువ చేస్తోందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఇక బీజేపీ వాళ్లు ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నారు. కానీ, ఉద్యమ సమయంలో ఆయన రాజీనామా చేసేందుకు భయపడ్డారని గుర్తు చేశారు.

ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం ఏనాడు పట్టించుకోవడం లేదన్నారు. విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లుగా కృష్ణా జలాల వాటా తేల్చలేదన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ లేఖలు రాసినా స్పందన కేంద్రం నుంచి రాలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 1,350 కోట్ల బకాయిలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే లు మదన్ రెడ్డి, క్రాంతికిరణ్, మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed