యోనో యాప్ అప్డేట్ పేరుతో సైబర్ మోసం..

by Taduka Kalyani |

కంగ్టి మండలంలోని ఎన్కె మూరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.5.48 లక్షలు కోల్పోయాడు.

యోనో యాప్ అప్డేట్ పేరుతో సైబర్ మోసం..
X

దిశ , కంగ్టి: కంగ్టి మండలంలోని ఎన్కె మూరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.5.48 లక్షలు కోల్పోయాడు. వాట్సాప్‌లో "యోనో యాప్ అప్డేట్" పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్‌ను బ్యాంకు నుంచి పంపినదేనని భావించి తెరిచాడు. వెంటనే అతని ఫోన్‌పై సైబర్ నేరగాళ్లు నియంత్రణ సాధించి, కొద్దిసేపట్లోనే బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.5 లక్షల 48 వేల రూపాయలను కాజేశారు. డబ్బులు మాయమైన విషయం గుర్తించిన బాధితుడు వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయగా, కంగ్టి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, బ్యాంకులు వాట్సాప్ ద్వారా ఇలాంటి ఫైళ్లను పంపవని, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫైళ్లు, లింకులు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దని హెచ్చరించారు. అలాగే ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. ఒక్క క్లిక్‌తోనే ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు మోసగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని, సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930కు ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి పొందే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకట్ రెడ్డి సూచించారు.

Next Story