పటాన్ చెరు సాకిచెరువు గట్టున బఫర్ జోన్‌లో నిర్మాణాలు

by velandi.Saikiran |   (  Updated:2026-03-28 21:45:40  IST  )

‘ఇన్‌కార్ లేక్ సిటీ’ అక్రమాలకు కేరాఫ్ గా మారింది.

పటాన్ చెరు సాకిచెరువు గట్టున బఫర్ జోన్‌లో నిర్మాణాలు
X

అక్రమాలకు కేరాఫ్ ‘ఇన్‌కార్’!

- పటాన్ చెరు సాకిచెరువు గట్టున బఫర్ జోన్‌లో నిర్మాణాలు

- ప్లాట్లు చూపడం లేదని కొనుగోలుదారుల నిరసన

దిశ, సంగారెడ్డి బ్యూరో: ‘ఇన్‌కార్ లేక్ సిటీ’ అక్రమాలకు కేరాఫ్ గా మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ నడిబొడ్డున సాకిచెరువు గట్టున ప్రముఖ రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు వివాదాలకు కేంద్రంగా మారాయి. టీజీఐఐసీ రైతుల నుంచి సేకరించిన భూమిని ఇన్‌కార్ కు బదలాయింపు మొదలుకుని నిర్మాణాల వరకు అన్నీ అక్రమాలే చోటుచేసుకున్నట్టు స్పష్టమవుతున్నది. స్థానిక ప్రజాప్రతినిధులు మొదలుకుని ప్లాట్ల కొనుగోలుదారులూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇన్‌కార్.. తనకేమీ పట్టనట్టు బఫర్ జోన్‌లో రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నది. ఇదిలా ఉండగా, తమకు 2024లోనే ప్లాట్లు ఇస్తామని అగ్రిమెంట్ చేసి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో డబ్బులు చెల్లించిన వారు శనివారం పెద్దఎత్తున నిరసనకు దిగారు. దీంతో మరోసారి ఇన్‌కార్ వ్యవహారం చర్చనీయాంశమైంది.

టీజీఐఐసీ అభ్యంతరం.. జీహెచ్ఎంసీ క్లీన్ చిట్!

పటాన్‌చెరులో ఇన్‌కార్‌కు భూసేకరణ నుంచీ వివాదాలే ఉన్నాయి. స్థానిక రైతుల నుంచి టీజీఐఐసీ ఈ భూములు సేకరించింది. నిబంధనల ప్రకారం టీజీఐఐసీ నుంచి భూమి బదలాయింపు జరగాలి. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా భూ బదలాయింపు అయింది. ఎలాంటి ఎన్ఓసీ లేకుండా ఇన్‌కార్‌కు భూమి అప్పగించడం గమనార్హం. ఓ వైపు టీజీఐఐసీ వ్యతిరేకిస్తుండగా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం 2020 నవంబర్ 9న లేక్ సిటీకి అనుమతులు ఇచ్చారు. జీహెచ్ఎంసీ అనుమతుల పేరుతో అప్పటి అధికారపార్టీ అండదండలతో ఇన్‌కార్ 2021లో 32 ఎకరాల విస్తీర్ణంలో 1500 ప్లాట్లు.. ఏ, బీ బ్లాకులతో నిర్మాణాలు మొదలుపెట్టింది. ప్రభుత్వ రికార్డుల్లో ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ అనుమతులు మంజూరు కావడం చర్చనీయాంశమైంది.

పెద్దల అండతో భవంతులు

టీజీఐఐసీ పరిధిలోకి వచ్చే ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకోవడానికి అధికారులు యత్నించారు. 2021లో నిర్మాణాల సమయంలోనే ఆ భూములకు ఎలాంటి లావాదేవీలు జరపకుండా 2021 జనవరి 5న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆ శాఖ అధికారులు లేఖలు రాశారు. ఆ తర్వాత నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎన్ఓసీ జారీచేయడం గమనార్హం. అనుమతులు లేకుండా నిర్మాణాలు మొదలుపెట్టిన ఆ సంస్థ 2023 నవంబర్ లో భూములను మ్యూటేషన్ చేయాలని అభ్యర్థించగా సర్కారు ఆదేశాలిచ్చింది. పూర్తిగా పైరవీలు, పలుకుబడి, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఇన్‌కార్ భవంతుల నిర్మాణాలు జరిగినట్లు స్పష్టమవుతున్నది.

ఫిర్యాదుల పరంపర

ఇస్కార్ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పలుమార్లు స్వయంగా భవంతుల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. బఫర్ జోన్ లో అక్రమంగా రోడ్ల నిర్మాణం ఆపాలని నిరసన తెలిపారు. పలుమార్లు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రీలాంచ్ పేరుతో ఇన్‌కార్ ఇచ్చిన ఆకర్షణీయమైన ప్రకటనలతో తాము మోసపోయి ప్లాట్లు కొన్నామని, అగ్రిమెంట్ చేసుకున్న సంస్థ ఇప్పటికీ ప్లాట్లు చూపడం లేదని ఇటీవల 450 మంది కొనుగోలు దారులు ఇన్‌కార్ ముందు ఆందోళనకు దిగారు. 2024 జూన్ వరకు ప్లాట్లు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారని, రెండేళ్లు గడచినా స్పందించడం లేదని ప్లాట్లు కొన్నవారు ఆక్రందన వ్యక్తం చేశారు. ప్లాట్లు అప్పగించకుండా ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పిమోసగిస్తున్నారని ఆరోపించారు. కొనేముందు ఒక రేరా నెంబర్ చూపించి ఇప్పుడు మరోరేరా నెంబర్ చూపిస్తున్నారని బాధితులు ఆగ్రహించారు. దీంతో సంస్థ నిర్వాహకులు ఏప్రిల్ 4న ఎండీ సూర్యనారాయణతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇప్పించడంతో ఆందోళన విరమించారు.

Next Story