శ్మశాన వాటికకు వెళ్లకుండా అడ్డు గోడల నిర్మాణం

by velandi.Saikiran |   (  Updated:2026-02-23 22:15:09  IST  )

ప్రస్తుతం భూముల ధరలు అమాంతంగా పెరిగిపోతున్న తరుణంలో వాటిని ఎలాగైనా కబ్జా చేసి క్యాష్ చేసుకోవాలని తెగిస్తున్నారు.

శ్మశాన వాటికకు వెళ్లకుండా అడ్డు గోడల నిర్మాణం
X

శ్మశాన వాటికకు వెళ్లకుండా అడ్డు గోడల నిర్మాణం

lఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులు

lరాజకీయ పలుకుబడితోనే ఇష్టారాజ్యం

lసర్వే చేసి నిర్మాణాలు

కూల్చి వేస్తాం: తహసీల్దార్

దిశ, సంగారెడ్డి: ప్రస్తుతం భూముల ధరలు అమాంతంగా పెరిగిపోతున్న తరుణంలో వాటిని ఎలాగైనా కబ్జా చేసి క్యాష్ చేసుకోవాలని అక్రమార్కులు ఎంతకైనా తెగిస్తున్నారు. తమ స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేసుకుని చుట్టూ గోడ నిర్మించుకున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం కూతవేటు దూరంలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ లో ఈ కబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది.

వెంచర్ నిర్వాహకుల ఇష్టారాజ్యం

కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 101/2లో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని 30 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం స్థానికంగా నివసించే గ్రామ ప్రజల విన్నపం మేరకు స్థానిక పద్మశాలి, గౌడ కులస్తులకు స్మశాన వాటిక కోసం కేటాయించింది. అప్పటి నుంచి ఆ స్థలాన్ని స్మశాన వాటిక కోసం వాడుతున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ఓ బడా ప్రైవేటు వెంచర్ ఈ స్థలంపై కన్ను వేసింది. ఇదే సర్వే నెంబర్ పక్కనే ఉన్న 101/1లో 10 ఎకరాల పట్టా భూమి ఉంది. అయితే ఈ పట్టా భూమికి చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రకాష్ గ్రూప్ పేరిట అక్కడ "ఎలైట్ విస్టా" ప్లాట్స్ అండ్ హౌసెస్ వెంచర్ ను ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ వెంచర్ కు ఆనుకొని ఉన్న స్మశాన వాటిక స్థలాన్ని కూడా తమ భూమిలో కలిపేసుకున్నారు. అంతటితో ఆగకుండా కబ్జా చేసిన ఆ స్థలం చుట్టూ గోడను కూడా నిర్మించారు. కాగా శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అడ్డుగా గోడ నిర్మించి అందులో రోడ్డు వేసుకోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కబ్జా వ్యవహారం పై స్థానికులు సదరు ప్రైవేటు వెంచర్ వారిని ప్రశ్నించేందుకు వెళితే వారు తిరిగి తమను బెదిరింపులకు గురి చేస్తున్నట్టు వారు వాపోతున్నారు. ఈ క్రమంలో స్థానికులు జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించి పరిస్థితిని వివరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సర్వేచేసి కూల్చివేస్తాం..

మల్కాపూర్ సర్వే నంబర్ 101/2 రెండు ఎకరాల్లో కొంత ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసినట్లు తమ దృష్టికి వచ్చింది. ఈ విషయంలో సిబ్బందితో సర్వే చేసిన అనంతరం నిజమని తెలితే అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తాం. ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేయాలని చూసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

- అశోక్, తహసీల్దార్, కొండాపూర్

Next Story