- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: దుబ్బాక ఎమ్మెల్యే
పంట చేతికోచ్చి నెల రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం ఇంకా కొనుగోళ్లు చేపట్టకపోవడం సిగ్గుచేటు అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు

దిశ, మిరుదొడ్డి: పంట చేతికోచ్చి నెల రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం ఇంకా కొనుగోళ్లు చేపట్టకపోవడం సిగ్గుచేటు అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గంలోని మార్కెట్లలో ఎక్కడ చూసినా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి ధాన్యం కుప్పలు అలాగే ఉన్నాయని అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని ఆల్వాల, చెప్యాల, లింగుపల్లి గ్రామాలకు చెందిన రైతులు చెప్యాల ఎక్స్ రోడ్డుపై బైఠాయించి సుమారు రెండు గంటల ధర్నా నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే రైతులకు సంఘీభావం తెలిపారు. రైతులతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మాని రైతులను ఆదుకోవాలని అన్నారు. తాలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓ వైపు వాతావరణ శాఖ వారు వడగళ్ళ వానలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి చేరుకున్న దుబ్బాక సీఐ రాజేష్, మిరుదొడ్డి ఎస్సై సమతా, పోలీసు సిబ్బంది, మిరుదొడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.






