- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు దశల్లో కంటింజెన్సీ ప్లాన్ అమలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా శాస్త్రీయ ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.

దిశ, సంగారెడ్డి బ్యూరో: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా శాస్త్రీయ ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పటాన్‌చెరులోని ఇక్రిశాట్ లో రాష్ట్ర స్థాయి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, వాతావరణ తదితర అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో "రాష్ట్రంలో ఎల్‌నినో నేపథ్యంలో కంటింజెన్సీ ప్లానింగ్" పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత వర్షపాత పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, వర్షాలు ఆలస్యం అయ్యే అవకాశాలు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం, భూగర్భ జలాల లభ్యత, ఖరీఫ్ పంటలపై ప్రభావం, రైతులకు అందించాల్సిన సాంకేతిక సూచనలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రామాణికంగా తీసుకుని మూడు దశల్లో కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. వర్షపాత పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ ప్రతి జిల్లాకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ముందస్తుగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాలుగా మారిన నేపథ్యంలో శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అనుసరించాలని తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా లేదా తక్కువగా కురిసినా రైతులు ఇబ్బందులు పడకుండా వరికి బదులుగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, వేరుశనగ, పెసలు, మినుములు, కందులు, సజ్జలు, జొన్నలు వంటి తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అలాగే తక్కువ కాల వ్యవధిలో దిగుబడి ఇచ్చే స్వల్పకాలిక విత్తనాలను అందుబాటులో ఉంచి రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతులకు స్పష్టమైన సూచనలు అందించాలి..
ప్రతి జిల్లాలో వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా ఏ పంటలు సాగు చేయాలో రైతులకు స్పష్టమైన సూచనలు అందించాలని, వాతావరణ శాఖ, నీటిపారుదల శాఖ, భూగర్భ జలాల శాఖల నుంచి రోజువారీ సమాచారం సేకరించి రైతులకు చేరవేయాలని మంత్రి తెలిపారు. వాతావరణ సమాచారం, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల స్థితి వంటి అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించి రైతులు ముందస్తు నిర్ణయాలు తీసుకునేలా చూడాలని సూచించారు. వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న కంటింజెన్సీ ప్లాన్‌ను వెంటనే విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇక్రిశాట్, భారత వాతావరణ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఐసీఏఆర్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్ తదితర సంస్థల శాస్త్రవేత్తలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం అంచనాలు, పంటలపై ప్రభావం, తేమ సంరక్షణ, సూక్ష్మ నీటిపారుదల, పంటల వైవిధ్యీకరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయంపై వివరించారు.
ఈ సమావేశంలో పాల్గొన్నవారు...
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సహకారంతో ప్రతి జిల్లాకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ & సహకార శాఖ ప్రభుత్వ కార్యదర్శి కే.సురేంద్రమోహన్, ఉద్యాన & సెరికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష, స్పెషల్ కమిషనర్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ రాహుల్ రాజ్, వ్యవసాయ & పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బి. గోపి, టీజీఎస్‌డబ్ల్యూసీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. లక్ష్మి, టీజీఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్, హాకా మేనేజింగ్ డైరెక్టర్ కె. చంద్రశేఖర్, భారత వాతావరణ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఐసీఏఆర్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, అలాగే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, భూగర్భ జలాలు, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






