కలెక్టర్‌కు అడ్డంగా బుక్కైన ఎన్ఐసీ అధికారులు.. సాక్ష్యాత్తు కలెక్టరేట్‌లోనే..

by Bhoopathi Nagaiah |

కలెక్టరేట్‌లో విధులు నిర్వహించే కొంతమంది అధికారులు ఇవాళ అడ్డంగా బుక్కయ్యారు.

కలెక్టర్‌కు అడ్డంగా బుక్కైన ఎన్ఐసీ అధికారులు.. సాక్ష్యాత్తు కలెక్టరేట్‌లోనే..
X

దిశ, మెదక్ ప్రతినిధి : కలెక్టరేట్‌లో విధులు నిర్వహించే కొంతమంది అధికారులు ఇవాళ అడ్డంగా బుక్కయ్యారు. సమయ పాలన లేకుండా విధులకు వస్తున్న అధికారులను కలెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే అనుమతి లేకుండా సెలవుల్లో వెళ్లిన అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ గుట్టును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేసిన ఆకస్మిక తనిఖీతో రట్టయింది. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలు కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రెవెన్యూ కార్యాలయంతో పాటు ఔట్ వార్డు, ఇన్ వార్డు సెక్షన్, ఖజానా శాఖ కార్యాలయం, ఎన్ఐసీ కార్యాలయాలను తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి 11:30 గంటలు అవుతున్న కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ఐసి కార్యాలయ పనితీరు పై ఆగ్రహం..

ఎన్ ఐ సి కార్యాలయం పనితీరు బాగోలేదని, అధికారి విధుల్లో ఉండాల్సిన ఉద్యోగి కలెక్టర్‌కు సమాచారం ఇవ్వకుండా సెలవు పై వెళ్లటంపై అసహనం వ్యక్తం చేశారు. మెమో జారీ చేయాలని డీఆర్ఓ‌ను ఆదేశించారు. ఖజానా శాఖ కార్యాలయం తనిఖీ చేస్తూ పెన్షన్ మంజూరులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఖజానా శాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది హాజరు పట్టిక పరిశీలిస్తూ సమయపాలన పాటించని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలన్నారు.

ఉద్యోగులు బాధ్యతతో ఉండాలి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ తమ కర్తవ్య బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని, ఉదయం 10:30 గంటల వరకు కార్యాలయాలకు చేరుకుని క్రమశిక్షణగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో బాధ్యతారాహిత్యం తగదన్నారు. వివిధ శాఖల అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాలు బేకాతర్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ భుజంగరావు, ఏవో యూనస్, కలెక్టరేట్ కార్యాలయ అకౌంటెంట్ పరమేష్, సిబ్బంది ఉన్నారు.

Next Story